ఈతరం భారతం సాహిత్యాంశం
_________________________
కొన్ని పుస్తకాలు కథలను చెబుతాయి.కొన్ని కాలాన్ని నమోదు చేస్తాయి.అరుదుగా కొన్ని ఒక నేల తన గురించి తానే చెప్పుకున్న ఆత్మకథగా నిలుస్తాయి.‘కరీంనగర్ జిల్లా కథలు’ అటువంటి అరుదైన కథా సంకలనం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే కథకు సారవంతమైన నేల. ఇక్కడ కథ కేవలం కల్పన నుంచి పుట్టలేదు; మట్టి వాసన నుంచి, చెమట చుక్క నుంచి, ఆకలి మంట నుంచి, ఉద్యమ నినాదం నుంచి, మనిషి అంతరంగపు సంఘర్షణ నుంచి పుట్టింది. పొలం గట్టు నుంచి పరిశ్రమ దాకా, పల్లె బాట నుంచి పట్టణ జీవితం దాకా, కుటుంబ సంబంధాల నుంచి సామాజిక వైరుధ్యాల దాకా ఈ ప్రాంతపు జీవితం కథకు ఎప్పటికప్పుడు కొత్త రక్తాన్ని అందించింది.అందుకే కరీంనగర్ కథను చదవడం అంటే ఒక ప్రాంతాన్ని భౌగోళిక పటంలో చూడటం కాదు; కాలం మనిషిపై రాసిన గాయాలను అక్షరాల్లో చదవడం.
రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, సిరిసిల్ల ప్రచురించిన ఈ బృహత్ సంకలనం 63 మంది రచయితల కథలను 623 పుటల్లో ఒకే సాహిత్య వేదికపై నిలిపింది. రూ.650 ధరతో వెలువడిన ఈ గ్రంథానికి తోట వైకుంఠం రూపొందించిన ముఖచిత్రం తెలంగాణ జీవన స్వభావానికి కళాత్మక ప్రవేశద్వారంలా నిలుస్తుంది.ఈ సంకలనం వెనుక ఒక స్ఫూర్తిదాయకమైన చరిత్ర ఉంది. కరీంనగర్ జిల్లా కథలను ఒక గ్రంథంగా తీసుకురావాల్సిన అవసరాన్ని మాజీ మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఒక సాహిత్య సమావేశంలో సూచించగా, ఆ ఆలోచనకు రంగినేని ట్రస్ట్ కార్యరూపం ఇచ్చింది. అప్పుడు పడిన విత్తనం కాలంతో మొలకెత్తి, నేడు అరవైమూడు కథల సాహిత్య వృక్షంగా పాఠకుల చేతుల్లో నిలవడం విశేషం.
భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పి.వి. నరసింహారావు ‘గొల్ల రామవ్వ’ ఈ సంకలనానికి చారిత్రక గాంభీర్యాన్ని చేకూరుస్తుంది. చెన్నమనేని విద్యాసాగర్ రావు ‘అవార్జి’, నలిమెల భాస్కర్ ‘మంద’, అల్లం రాజయ్య ‘అతడు’, బి.ఎస్. రాములు ‘బతుకు పయనం’, సంగెవేని రవీంద్ర ‘ప్రేమ’, పెద్దింటి అశోక్ కుమార్ ‘గుండెలో వాన’ వంటి కథలు విభిన్న జీవన పార్శ్వాలను స్పృశిస్తాయి. జీవితంలోని ఎన్నో కష్టాలను, కన్నీళ్లను దగ్గరగా చూసిన సైనికుడు పెరుక రాజు కలం నుంచి వచ్చిన ‘కన్నీళ్లు’ కథ, జీవితపు కఠిన వాస్తవాలను మానవీయ కోణంలో ఆవిష్కరిస్తూ హృదయాన్ని తడిపి, ఆలోచనను మేల్కొలుపుతుంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే అరవైమూడు మంది కథకుల సృజనాత్మక వైశిష్ట్యాన్ని కొన్ని పేర్లలో కుదించడం ఈ సంకలన విస్తృతికి న్యాయం చేయదు.ఇవి 63 కథలు మాత్రమే కావు సమాజాన్ని చూసిన 63 కిటికీలు.
ఒక కిటికీలో రైతు చెమట కనిపిస్తుంది మరొకదానిలో బతుకు పోరాటం. ఒక కథలో కన్నీరు నిశ్శబ్దంగా జారితే, ఇంకొక కథలో అదే కన్నీరు ప్రశ్నగా నిలబడుతుంది. ఎక్కడో ప్రేమ మనిషిని కలుపుతుంది ఎక్కడో అసమానత విడదీస్తుంది మరెక్కడో మట్టి, జ్ఞాపకం, ఆత్మగౌరవం, తిరుగుబాటు కథకు అంతర్వాహినులవుతాయి. భాషలో తెలంగాణ నుడికారం, వస్తువులో స్థానిక జీవితం ఉన్నప్పటికీ, వాటి అంతరాత్మ మాత్రం విశ్వమానవీయమైనది.
తొలితరం మలితరం కథకులను ఒకే చోటకు తీసుకురావడం ఈ గ్రంథం సాధించిన మరో ముఖ్యమైన పని. అన్ని కథలను చేర్చలేకపోయామని, ఆర్థిక పరిమితులు, కథల లభ్యత తదితర కారణాలతో ఈ ప్రయత్నం ఇంకా అసంపూర్ణమేనని సంపాదకులు పేర్కొనడం వారి సాహిత్య నిజాయితీకి నిదర్శనం. నిజానికి ఈ ‘అసంపూర్ణతే’ మరో సంపుటికి ఆహ్వానం. ఎందుకంటే ఒక ప్రాంతపు కథాచరిత్రను ఏ ఒక్క పుస్తకమూ పూర్తిగా బంధించలేదు.
ప్రాంతీయ సాహిత్యం ప్రాంతానికి పరిమితమైనది కాదు. వేరు ఎంత లోతుగా తన నేలలోకి వెళ్తే, చెట్టు అంత విశాలంగా ఆకాశాన్ని తాకుతుంది. అలాగే స్థానిక జీవితాన్ని ఎంత నిజాయితీగా కథ చెబితే, అది అంత విశ్వజనీనంగా మారుతుంది. ఈ సంకలనంలోని ఆకలి, ప్రేమ, దుఃఖం, శ్రమ, అన్యాయం, ఆత్మగౌరవం, ప్రతిఘటన అన్నీ చివరకు మనిషివే.
అందుకే 623 పుటల ఈ గ్రంథం కేవలం పెద్ద పుస్తకం కాదు ఒక జిల్లా నడిచివచ్చిన కాలపు అడుగుజాడల భాండాగారం. పరిశోధకుడికి ఆధారం, కొత్త కథకుడికి పాఠశాల, సాహిత్యాభిమానికీ అనుభవం, రాబోయే తరాలకు కథారూపంలో అందించిన సామాజిక జ్ఞాపకం.
తెలుగు కథను ప్రేమించే ప్రతి పాఠకుడి గ్రంథాలయంలో నిలవదగిన కథల నిధి మన కరీంనగరం.
ఒక్క మాటలో ఇది 63 కథల సంకలనం కాదు 63 కలాలు కలిసి రాసిన ఒక నేల సామూహిక ఆత్మకథ.
డా పెరుక రాజు
బహుభాషావేత్త & విమర్శకుడు
7810032847















