ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 16 :
___________________________________
బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు.ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా వెల్లడించారు.రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున, మెుత్తం 1.19 లక్షల మంది అర్హులైన బీసీ మహిళలను ఈ పథకం ద్వారా ఎంపిక చేయనున్నారు.వీరికి ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తిగా 100 శాతం సబ్సిడీపై అత్యాధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందజేస్తారు.ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన మహిళలు ఎవరైనా ఉంటే,వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ నెల 30వ తేదీలోపు అధికారిక వెబ్సైట్ అయిన TGOBMMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.ఇంటి వద్దే ఉంటూ స్వయం ఉపాధి పొందడం ద్వారా మహిళలు తమ కుటుంబాల ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం అర్హులైన ప్రతి మహిళకు చేరేలా అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని,గడువులోగా అందరూ దరఖాస్తు చేసుకునేలా తగిన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.















