ఈతరం భారతం ఖమ్మం సెప్టెంబర్ 16 :
_______________________________
ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించేందుకు భారతీయ రైల్వే, దేశవ్యాప్తంగా స్టేషన్లను పునరాభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఎ.బి.ఎస్.ఎస్)’ తో భారీ పరివర్తనను చేపడుతోంది. ఈ పధకంలో భాగంగా తెలంగాణలో, ₹2000 కోట్లకు పైగా వ్యయంతో 40 రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి చేయబడుతున్నాయి. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీగారు 2023 ఆగస్టు మరియు 2024 ఫిబ్రవరి నెలల్లో రాష్ట్రంలోని స్టేషన్ల పునరాభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో ఈ కార్యక్రమం గణనీయమైన ఊపందుకుంది.
ఇందులో భాగంగా, దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనున్న ఖమ్మం రైల్వే స్టేషన్ రూ.25.41 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేయబడుతుంది. కాజీపేట – విజయవాడ రైల్వే సెక్షన్లో ఉన్నటువంటి ఖమ్మం రైల్వే స్టేషన్‌ను నాన్-సబర్బన్ గ్రేడ్-3 (ఎన్.ఎస్.జి-3) స్టేషన్‌గా వర్గీకరించబడింది. ఈ స్టేషన్లో సగటున రోజుకు 20,000మంది ప్రయాణీకుల రాకపోకలతో ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది. ఖమ్మం రైల్వే స్టేషన్లో సుమారు 55 రైళ్లు నిలుస్తాయి. న్యూఢిల్లీ, హౌరా, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి తదితర ముఖ్య గమ్యస్థానాలకు వెళ్లే పలు ముఖ్యమైన సూపర్‌ఫాస్ట్ రైళ్లకు కూడా ఖమ్మం స్టేషన్లో హాల్ట్ సౌకర్యం ఉంది.
రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, సౌలభ్యం కల్పించి, మొత్తం ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో, ఖమ్మం స్టేషన్లో ఇప్పుడు ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలు మరియు సదుపాయాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పాదచారుల వంతెన, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫారాలు , విశ్రాంతి గది, ఆర్పిఎఫ్ గదులు, ఏసీ లాంజ్ మొదలైన వాటి మెరుగుదలలతో సహా అనేక పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అదే సమయంలో, నూతన స్టేషన్ భవన నిర్మాణ పనులు, స్టేషను ఆవరణలో పచ్చదనాన్నిపెంచడం, స్టేషన్ ప్రాంగణం మరియు స్టేషన్ ముఖభాగం అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ఖమ్మం రైల్వే స్టేషన్ ఢిల్లీ-చెన్నై మరియు హైదరాబాద్-విజయవాడ రైల్వే లైన్ల కూడలిలో కీలకమైన ప్రదేశంలో నెలకొని ఉంది. ఇది ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య రైళ్ల రాకపోకలను సులభతరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉండి, అనేక విద్యాసంస్థలు మరియు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు నిలయంగా ఉంది. ఇది చుట్టుపక్కల ఉన్న అనేక పట్టణాలు, గ్రామాలకు ప్రధాన కేంద్రంగా కూడా పనిచేస్తుంది. ఖమ్మం రైల్వే స్టేషన్ రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతున్న పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటిగా నిలుస్తుంది. ఖమ్మం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి వల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సులభమైన రాకపోకలు మరియు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుంది. అదే సమయంలో స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కూడా గణనీయంగా దోహదపడుతుంది.















