ఈతరం భారతం తిరుమల సెప్టెంబర్ 20 రిపోర్టర్ మనోజ్ కుమార్ :
__________________________________________________
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన ఆదివారం ఉదయం నిర్వహించిన హనుమంత వాహనసేవలో భక్తి, సంగీతం, నృత్యం, సంప్రదాయ కళారూపాలు మేళవించి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తుండగా, దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు సింగపూర్ నుంచి విచ్చేసిన కళాబృందాలు తమ ప్రాంతాల విశిష్ట సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించాయి.
వైవిధ్యభరిత కళారూపాల సమ్మేళనం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఒడిశా, బీహార్, కర్ణాటక, మణిపూర్, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్‌తో పాటు సింగపూర్ నుంచి వచ్చిన కళాకారులు నృత్య, గాన, వాద్య ప్రదర్శనలతో తమ ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు.
విభిన్న ప్రాంతాల కళారూపాలు ఒకే వేదికపై కొలువుదీరడంతో హనుమంత వాహనసేవలో భారతీయ సంస్కృతిలోని భిన్నత్వంలో ఏకత్వం సాక్షాత్కరించింది. కళాకారుల నృత్య విన్యాసాలు, గానాలాపనలు, వాద్య నినాదాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
భక్తి–కళా వైభవంతో కనులపండువగా సేవ
శ్రీ మలయప్పస్వామివారి వాహనసేవను తిలకిస్తున్న భక్తులకు కళాకారుల సంప్రదాయ ప్రదర్శనలు అదనపు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. భక్తి, సంప్రదాయం, కళా వైభవం సమ్మేళనంతో హనుమంత వాహనసేవ మరింత శోభాయమానంగా సాగింది.ఈ వాహనసేవలో 10 రాష్ట్రాలు, సింగపూర్‌కు చెందిన 25 కళాబృందాల నుంచి మొత్తం 681 మంది కళాకారులు పాల్గొని తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు.
నాలుగు ఉత్తమ కళాబృందాలకు ఈవో సన్మానం
హనుమంత వాహనసేవలో విశేష ప్రతిభ కనబరిచిన నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శాలువాతో సన్మానించారు.















