చెన్నయ్ నవంబర్ 15 (ఈతరం ఇండియా న్యూస్); తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.మరోవైపు ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులోని కడలూరు, మైలదుతురై, నాగపట్నం, తిరువారూర్, పుదుచ్చేరి లోని కారైకల్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, తంజావూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ఐదు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.మరోవైపు ఎడతెరిపి లేని భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు ఇప్పటికే సెలవు ప్రకటించారు. చెన్నైలోని పాఠశాలలు, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరి, కారైకల్‌లలో పాఠశాలలు, కళాశాలలకు కూడా అధికారులు సెలవు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా స్కూళ్లు, కాలేజీలకు హాలీడే ఇచ్చారు
















