EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మట్టి మనుషుల మనసుల్లో మిగిలిన ‘జాడ’ తెలంగాణ పల్లె జీవితానికి అక్షర సాక్ష్యం

ఈతరం భారతం( పత్రికలు, పుస్తకాలు)

తెలంగాణ పల్లె జీవితానికి అక్షర సాక్ష్యం ” జాడ”

కథ రాయడం అంటే సంఘటనను అక్షరాల్లోకి మార్చడం మాత్రమే కాదు కనిపించని జీవితాన్ని కనిపించేలా చేయడం. కాలం చెరిపేస్తున్న జ్ఞాపకాలకు చిరునామా ఇవ్వడం. మనిషి లోపలి సంఘర్షణకు గొంతు ఇవ్వడం. చదివిన కథ పాఠకుడిని వెంటాడితే, అందులోని పాత్ర తనకు తెలిసిన మనిషిలా అనిపిస్తే, కథ ముగిసిన తరువాత కూడా ఒక ప్రశ్న మిగిలితే అక్కడే కథ తన అసలు ప్రయోజనాన్ని సాధించినట్లు. ఆ దిశగా సాగిన కథల సమాహారమే అనిల్ తొలి కథా సంపుటి ‘జాడ’.

అనిల్ కథల కోసం ఎక్కడికో వెళ్లి జీవితాన్ని వెతకలేదు. తన చుట్టూ ఉన్న మనుషులను చూశాడు. తాను నడిచిన దారులను, చూసిన పేదరికాన్ని, అనుభవించిన బాల్యాన్ని, మారిపోతున్న పల్లెను, బీటలు వారుతున్న బంధాలను కథావస్తువులుగా మలిచాడు. అందుకే ఈ కథల్లో కల్పనకంటే అనుభవం, అలంకారం కంటే ఆత్మీయత, ఆర్భాటం కంటే జీవితం ఎక్కువగా కనిపిస్తాయి.‘జాడ’ సంపుటిలోని పదహారు కథలకు పదహారు నేపథ్యాలు ఉన్నా, వాటన్నింటినీ కలిపే అంతఃసూత్రం ఒక్కటే మనిషి.

‘జాడ’లో బాల్యం, స్నేహం, పల్లె జ్ఞాపకాలు ఒక జీవన మూలాన్ని వెతుకుతాయి. మనిషి ఎంత ఎదిగినా, ఎంత దూరం వెళ్లినా తన మూలాలను పూర్తిగా వదిలిపెట్టలేడనే భావన కథలో అంతర్లీనంగా ప్రవహిస్తుంది. ‘రాణి’లో వ్యక్తిత్వం కోల్పోయిన స్త్రీ అంతర్మథనం కనిపిస్తే, ‘చిట్టి ప్రశ్న’లో చిన్నారి అమాయకత్వమే పెద్దల సమాజాన్ని ప్రశ్నిస్తుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కంటే వాటిని సమాజం ముందుంచడమే రచయిత బాధ్యత. అనిల్ అక్కడ అదే చేశాడు.‘ఉడుo’, ‘నల్ల కోడి’ వంటి కథల్లో మూఢనమ్మకాల వెనుక దాగిన భయాన్ని రచయిత ప్రశ్నిస్తాడు. ‘పోయ్యల కట్టెలు’లో మండేది కట్టెలు మాత్రమే కాదు పేదరికం కాల్చిన బాల్యం కూడా. ‘కట్ట తెగింది’లో డబ్బు, బంధం, గౌరవం మధ్య మనిషి ఎక్కడ నిలబడుతున్నాడనే ప్రశ్న ఎదురవుతుంది.

‘వేలిముద్ర’ సాంకేతికత మానవత్వం మధ్య పెరుగుతున్న అంతరాన్ని గుర్తుచేస్తుంది. యంత్రం మనిషి పనిని సులభం చేయవచ్చు కానీ మనిషి స్థానాన్ని ఆక్రమించడం మొదలైతే సంబంధాల స్వరూపమే మారుతుంది. ‘తోడు’లో సంపద, సౌకర్యాలన్నీ ఉన్నా మనసుకు మనిషి అవసరమేననే సత్యం కనిపిస్తుంది. ‘దేవదాసి’ సామాజిక దురాచారాన్ని ప్రశ్నిస్తే, ‘అన్న గడప’ కుటుంబ అనుబంధాల విలువను గుర్తుచేస్తుంది.

‘మట్టి గోస’ ఈ సంపుటిలోని నేల గొంతు. రైతు మట్టి సంబంధం కేవలం ఉపాధికి సంబంధించినది కాదు అది తరాల అనుబంధం. రైతు చేతుల్లోని మట్టి అతని జీవన చరిత్ర కూడా. ‘చిరునామా’, ‘చివరి కాల్’ వంటి కథల్లో ఆధునిక జీవన వేగం మధ్య మనిషి కోల్పోతున్న ఆత్మీయతను రచయిత స్పృశించాడు.‘చెరువు’కు ఈ సంపుటిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ చెరువు కేవలం నీటి వనరు కాదు ఒక ఊరి జ్ఞాపకం, ఒక తరం బాల్యం, పల్లె సంస్కృతి, ప్రకృతితో మనిషికున్న సహజీవనానికి ప్రతీక.చెరువులు కనుమరుగవుతున్నాయంటే నీటి వనరులు మాత్రమే కాదువాటి చుట్టూ పెరిగిన సామూహిక జీవితం కూడా కనుమరుగవుతున్నదనే అంతర్వేదన కథ వెనుక వినిపిస్తుంది.

అనిల్ కథనంలోని ప్రధాన బలం నేలతనం. పాత్రలు రచయిత సృష్టించిన బొమ్మల్లా కాకుండా మన మధ్య తిరిగే మనుషుల్లా కనిపిస్తాయి. భాషలో తెలంగాణ పలుకు, కథనంలో పల్లె వాసన, సంఘటనల్లో అనుభవపు తడి ఉన్నాయి. పాత్రల మీద తీర్పు చెప్పడానికి తొందరపడకుండా, వాటిని పాఠకుడి ముందుంచి ఆలోచించే అవకాశం కల్పించడం రచయిత కథన విధానంలో చెప్పుకోదగిన లక్షణం.

అయితే కథకు సందేశం అవసరమే అయినా, సందేశం కథను నడపకూడదు; కథలో నుంచే సందేశం పుట్టాలి. కొన్ని కథల్లో రచయిత చెప్పదలచుకున్న భావం మరింత అంతర్లీనంగా, కథాశిల్పంలో భాగంగా వ్యక్తమైతే వాటి కళాత్మకత ఇంకా పెరుగుతుంది. అలాగే కొన్ని ముగింపుల్లో పాఠకుడి ఊహకు మరింత స్థలం వదిలితే కథల ప్రభావం మరింత గాఢమవుతుంది. తొలి కథా సంపుటి అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ శిల్పపరమైన అవకాశాలు రచయిత భవిష్యత్ కథా ప్రయాణానికి మరింత విస్తృతిని కల్పించగలవు. అన్నింటికంటే, రచనలో కనిపించే అనుభవ నిజాయితీ ‘జాడ’కు ప్రత్యేక బలం.

‘జాడ’ అనే శీర్షికే ఈ సంపుటి ఆత్మ. మనిషి వెళ్లిపోతాడు జ్ఞాపకం మిగులుతుంది. బాల్యం గడిచిపోతుంది అనుభవం మిగులుతుంది. ఊరు మారిపోతుంది మట్టి వాసన మిగులుతుంది. కథ ముగుస్తుంది కానీ మంచి కథ వేసిన ప్రశ్న మాత్రం మనసులో మిగులుతుంది.అందుకే ‘జాడ’ను చదవడం అంటే పదహారు కథలను చదవడం మాత్రమే కాదు; మనం ఎక్కడి నుంచి వచ్చామో, ప్రయాణంలో ఏమి కోల్పోయామో, మనలో ఇంకా ఏమి మిగిలి ఉందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడం.

కాలం అడుగులను చెరిపేయవచ్చు;

కానీ జీవితాన్ని తాకిన అక్షరాల జాడను చెరపలేదు.

అనిల్ తొలి కథా సంపుటి ‘జాడ’ను మై గిఫ్ట్ ప్రచురణలు ప్రచురించింది. పుస్తకం వెల రూ.160. ముఖచిత్ర రూపకల్పన చిన్నారి వృంద, డీటీపీ హరీశ్, ముద్రణ కర్షక ప్రింటర్స్ నిర్వహించారు. మట్టి వాసనను, మానవ సంబంధాల తడిని అక్షరాల్లోకి తీసుకొచ్చిన ఈ తొలి అడుగు, అనిల్ కథా ప్రయాణంలో మరిన్ని అర్థవంతమైన ‘జాడలు’ వేయాలని ఆకాంక్షిద్దాం.

ప్రతులకు: అనిల్

సెల్: 9849553995

డా. పెరుక రాజు

జాతీయ కవి, రచయిత, బహుభాషావేత్త

7810032847

_________________

Related News

Select the Topic
Scroll to Top