EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నవంబర్ 26, 27 సివిల్ ఇంజినీరింగ్ పరిష్కారాలపై ప్రత్యేక సదస్సు

ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్3:

సుస్థిరమైన, వినూత్నమైన సివిల్ ఇంజినీరింగ్ పరిష్కారాలపై నవంబర్ 26, 27 తేదీల్లో ప్రత్యేక సదస్సు జరుగనుంది.సివిల్ ఇంజినీరింగ్ రంగంలో స్థిరమైన అభివృద్ధి, వినూత్న ఆవిష్కరణలు, విపత్తులను తట్టుకునే నిర్మాణాల రూపకల్పన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ (ఇండియా) హైదరాబాద్ సెంటర్ ఆధ్వర్యంలో RIDES-2026 సదస్సును నిర్వహించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI)లో రెండు రోజుల పాటు ఈ సదస్సుతో పాటు బిల్డ్-టెక్ ఎక్స్‌పో 2026 జరగనుంది.

ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన 1,000 మందికి పైగా సివిల్ ఇంజినీరింగ్ నిపుణులు, స్ట్రక్చరల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు హాజరుకానున్నారు. నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వారు చర్చించనున్నారు.

ఈ సదస్సులో పలువురు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ నిపుణులు ప్రసంగించనున్నారు. నలంద విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సునైనా సింగ్ ముఖ్యోపన్యాసం చేయనున్నారు. క్రీ.పూ. 415 నాటి చారిత్రక నలంద నిర్మాణాల పునరుద్ధరణ, పునరావాసం, పునర్నిర్మాణ అంశాలపై ఆమెప్రసంగించనున్నారు.ప్రొఫెసర్ డాక్టర్-ఇంగ్ మార్వాన్ అల్‌జయ్లాలే ఆధునిక డీప్ ఫౌండేషన్ ఇంజినీరింగ్‌పై వివరించనున్నారు. డాక్టర్ వి. రాజేంద్రన్, CSIR-SERC చెన్నై డైరెక్టర్ డాక్టర్ ఎన్. ఆనందవల్లి, డాక్టర్ మొహమ్మద్ అబ్బాల్ స్ట్రక్చరల్ రిహాబిలిటేషన్, స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్, లాంగ్ స్పాన్ నిర్మాణాలపై తమ అనుభవాలను పంచుకోనున్నారు.

డిజిటల్ ఇంజినీరింగ్, BIM ఆధారిత డిజైన్, 3D కాంక్రీట్ ప్రింటింగ్ వంటి ఆధునిక అంశాలపై రాయ్ అనిరుద్ధ, L&T కన్‌స్ట్రక్షన్‌కు చెందిన ఎర్. వి. ఉమామహేశ్వరన్ ప్రసంగించనున్నారు.

అలాగే హై-రైజ్ భవనాల్లో ప్లంబింగ్ వ్యవస్థలు, గ్రీన్ రూఫ్స్, వర్టికల్ ట్రాన్స్‌పోర్టేషన్, కాంపోజిట్ స్ట్రక్చర్స్ వంటి అంశాలపై ఎర్. వీరేష్ ఎస్.సి., డాక్టర్ అంకిత్ గార్గ్, ఎర్. వి. జగదీష్ కుమార్, ఎర్. గురురాజ్ ఎస్. థాలి తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

వాతావరణ మార్పులు, తీవ్ర ప్రకృతి వైపరీత్యాలు, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, పాతబడుతున్న మౌలిక సదుపాయాల నేపథ్యంలో భవిష్యత్తు నిర్మాణ రంగానికి అవసరమైన సురక్షితమైన, సుస్థిరమైన, వినూత్న ఇంజినీరింగ్ పరిష్కారాలను ప్రోత్సహించడమే RIDES-2026 ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ సదస్సు తో పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి మరింత బలోపేతం కానుంది.

సదస్సుతో పాటు నిర్వహించే బిల్డ్-టెక్ ఎక్స్‌పో 2026లో ఆధునిక నిర్మాణ సామగ్రి, అత్యాధునిక యంత్రాలు, ఇంజినీరింగ్ సాఫ్ట్‌వేర్, పర్యావరణహిత నిర్మాణ పరిష్కారాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించనున్నారు. ఉత్పత్తుల ప్రత్యక్ష ప్రదర్శనలు, వ్యాపార అవకాశాలు, నెట్‌వర్కింగ్‌కు ఈ ఎక్స్‌పో వేదికగా నిలవనుంది.

Related News

Select the Topic
Scroll to Top