EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఖమ్మంలో తాగునీటి సరఫరా మెరుగు పరిచేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం

ఈతరం భారతం ఖమ్మం నవంబర్ 3:

ఖమ్మం నగరంలో తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు రూ.200 కోట్ల వ్యయంతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నామని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పేర్కొన్నారు.ఖమ్మం నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు యూఐడీఎఫ్ నిధులు రూ.200 కోట్లతో చేపడుతున్న వాటర్ సప్లై ఇంప్రూవ్‌మెంట్ స్కీమ్ పనులను కమిషనర్ మంగళవారం పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పథకం కింద చేపడుతున్న వివిధ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ.. ఈ పథకంలో భాగంగా నగరంలో మొత్తం 23 ఎత్తైన నీటి నిల్వ ట్యాంకులు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. తాగునీటి పంపిణీని మెరుగుపరిచేందుకు నగరాన్ని మొత్తం 35 డిస్ట్రిబ్యూషన్ జోన్లుగా విభజించామన్నారు.ప్రస్తుతం టేకులపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతం, ఖానాపురం కొలిపాక ఫంక్షన్ హాల్ సమీపంలో, రామన్నపేట ప్రాంతాల్లో మూడు నీటి ట్యాంకుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అదేవిధంగా నగరంలో 19,000 గృహాలకు హౌస్ సర్వీస్ కనెక్షన్లు కల్పించడంతో పాటు, మొత్తం 122 కిలోమీటర్ల మేర తాగునీటి పంపిణీ పైప్‌లైన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నామన్నారు.రోజుకు 25 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యంతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించేందుకు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వద్ద ఆటోమేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా బల్క్ వాటర్ సప్లైని పర్యవేక్షించడం, నియంత్రించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ పథకం పూర్తయితే ఖమ్మం నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు, నగర ప్రజలకు మెరుగైన నీటి సరఫరా అందుబాటులోకి వస్తుందన్నారు. పథకం పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ డీఈఈ నవీన్, ఏఈలు నవ్య జ్యోతి, దివ్య పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top