ఈతరం భారతం షీ టీమ్ కార్యాలయం ఖమ్మం నవంబర్ 7:
మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపుతూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.శుక్రవారం రాత్రి ఖమ్మం మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, (ఏహెచ్‌టీయూ) షీ టీమ్స్ బృందాలు సంయుక్తంగా ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి నిర్వహించామని తెలిపారు. ఈ దాడిలో వ్యభిచార గృహంలో ఉన్న ముగ్గురు బాధిత మహిళలను పోలీసులు రక్షించడంతో ఈ అక్రమ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను గుర్తించామన్నారు. వీరిలో నిర్వాహకులు, విటులు ఉన్నారన్నారు. దాడి సందర్భంగా ఐదు స్మార్ట్‌ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్ కలిపి మొత్తం ఆరు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహిళల అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారం, మహిళలపై దోపిడీ వంటి నేరాలకు పాల్పడే వారిపై నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. మహిళల భద్రతకు భంగం కలిగించే ఎలాంటి అక్రమ కార్యకలాపాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లుతెలిపారు.ఈ దాడిలో ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.















