EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వెలుగుమట్ల మోడల్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి … జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్

ఈతరం భారతం నవంబర్ 10: ఖమ్మం

——————————————

ఖమ్మం నగరపాలక సంస్థ 15వ డివిజన్ పరిధిలోని వెలుగుమట్ల మోడల్ కాలనీలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులతో పాటు అన్ని రకాల మౌళిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అధికారులను ఆదేశించారు. వెలుగుమట్ల మోడల్ కాలనీని క్షేత్రస్థాయిలో సందర్శించిన కలెక్టర్, పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ వెలుగుమట్ల మోడల్ కాలనీలో మొత్తం 300 ఇళ్లకు మంజూరు ఇవ్వడం జరిగిందని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక ప్రకారం ఇప్పటికే 22 ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా ముగిసి ఫినిషింగ్ దశకు చేరగా, 119 ఇళ్లకు స్లాబ్ పనులు పూర్తయ్యాయని వివరించారు. అలాగే 59 ఇళ్లు రూఫ్ లెవల్, 98 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయిలో ఉన్నాయని, మిగిలిన ఇళ్ల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయిస్తున్నామని అన్నారు. లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఇళ్ల నిర్మాణ స్టేజీని బట్టి ప్రతి సోమవారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు వివిధ దశల్లో ఉన్న 205 ఇళ్లకు సంబంధించిన పేమెంట్లు పూర్తయ్యాయని, మిగిలిన పెండింగ్ బిల్లులను కూడా వెంటనే విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇళ్ల నిర్మాణ వేగాన్ని పెంచేందుకు ఇప్పటివరకు 133 మంది లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందించామని తెలిపారు. కాలనీ వాసులకు అవసరమైన ఆరోగ్య, విద్యా సదుపాయాలు కల్పించడంలో భాగంగా నిర్మిస్తున్న బస్తీ దవాఖానా, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పనులు వేగంగా పురోగతిలో ఉన్నాయని, ఈ నెలాఖరు నాటికి అన్ని పనులనూ పూర్తి చేసి, కాలనీని మోడల్‌గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలలో ఎలాంటి రాజీ పడకూడదని, ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.కలెక్టర్ తనిఖీ సమయంలో హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, డీఈ కె. జగ్రామ్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ డీఈ నవ్యజ్యోతి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ జయచంద్ర, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top