ఈతరం భారతం అమరావతి ఆంధ్ర ప్రదేశ్ నవంబర్ 10:
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల తమ పదమూడేళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. ఇద్దరూ కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ సంచలనం సృష్టించింది.
పరిపక్వతతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇద్దరూ తెలిపారు. పరస్పర అవగాహన, ఒకరిపై ఒకరి గౌరవంతోనే విడిపోతున్నట్లు స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా ప్రయాణం ముగిసినా మంచి స్నేహితులుగా ఉంటామని చెప్పారు. పిల్లలు మార్క్ శంకర్ పవనోవిచ్, పొలేనా అంజనా భవిష్యత్తు, శ్రేయస్సు తమ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించారు. పిల్లల సంరక్షణను ఇద్దరూ కలిసి పంచుకుంటామని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మీడియా, అభిమానులు తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
విడాకులకు గల నిర్దిష్ట కారణాలను వారు బయటపెట్టలేదు. రాజకీయాల్లో పూర్తి బిజీ కావడంతో పాటు జీవనశైలిలో తేడాలు రావడమే ఈ నిర్ణయానికి కారణమని ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ చివరి నాటికే అన్నా కొణిదెల తన సోషల్ మీడియా ఖాతాను తొలగించారు. ఈ పరిణామం ముందే సంకేతం ఇచ్చిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ఈ వార్తతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల బాధ్యతను కలిసి చూస్తామన్న వారి నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తున్నారు. మూడోసారి విడాకులు జరగడంపై ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ట్రోలర్లు రకరకాల పోస్టులతో దుమారం రేపుతున్నారు. అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందనే కోణంలోనూ విశ్లేషణలు సాగుతున్నాయి.















