ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 10:
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఒకవైపు చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండగా.. మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వర్షాలు, చలి, పొగమంచు ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది ఏ దిశగా కదులుతుంది? ఎంతవరకు బలపడుతుంది? అనే అంశాలపై వర్షాల తీవ్రత ఆధారపడి ఉంటుంది. అల్పపీడన గమనంపై స్పష్టత వచ్చిన తర్వాత ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయనే దానిపై మరింత సమాచారం అందే అవకాశం ఉంది.
ప్రస్తుతం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.















