ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 24;
తెలంగాణకు 512 టీఎంసీల కృష్ణా జలాలు రావాల్సి ఉండగా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలకు ఎందుకు సంతకాలు పెట్టిందో సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు డిమాండ్ చేశారు.మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ నీటి సమస్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
గత బీఆర్ఎస్ సర్కారు.. రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందంటూ అబద్ధాల ప్రచారాలు చేశారు.. తీరా ప్రజలు దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చేసరికి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు, ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
కేంద్రం ఏమి ఇచ్చిందని అడిగే నైతికహక్కు కాంగ్రెస్ కు లేదు
కేంద్రం ఏమి ఇచ్చిందని అడిగే నైతికహక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు.కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటివరకు సుమారు 13 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది, పేదలకు ఉచిత బియ్యాన్ని కేంద్రమే అందిస్తోంది.గతంలో 3 గంటలు పట్టే ప్రయాణాన్ని నేడు గంటలోనే పూర్తి చేసేలా మోదీ ప్రభుత్వం జాతీయ రహదారులను నిర్మించింది.కాంగ్రెస్ హయాంలో వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని పక్క రాష్ట్రానికి తరలిస్తే, మోదీ ప్రభుత్వం దాన్ని మళ్లీ ప్రారంభించింది. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా కేంద్రం మంజూరు చేసింది.
ములుగులో గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ, బీబీనగర్‌లో ఎయిమ్స్ (AIIMS), జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడార్ (నిమ్జ్), వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్, 3000 మెగావాట్ల సౌర విద్యుత్ అనుమతులు, రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ పునరుద్ధరణ వంటి ఎన్నో ప్రాజెక్టులను కేంద్రం అందించింది.
అసలు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ సర్కారు ఏమి చేసిందో మంత్రులు ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలి.రాష్ట్ర నిధులన్నీ కేవలం కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికే వెళ్తున్నాయని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల నక్సలైట్ ఉద్యమం బలహీనపడింది
పెద్ద నోట్ల రద్దు వల్ల నక్సలైట్ ఉద్యమం బలహీనపడిందని, ఉగ్రవాదం అణిచివేయబడిందని లొంగిపోయిన నక్సలైట్లే స్వయంగా చెబుతున్నారన్నారు.బంగారం కొనుగోళ్లు తగ్గించి ఈవీ వాహనాలు వాడాలని ప్రధాని మోదీ గారు సూచించినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎగతాళి చేశారు, కానీ ఆ విధానం వల్ల దిగుమతులు తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది.భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ఐఎంఎఫ్ (IMF), వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి.అమెరికాలో భారత ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ సైతం భారత వృద్ధిని ప్రశంసించారు.రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు… కానీ రాబోయే రోజుల్లో తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్ అధికారం కోల్పోతుందని రామచంద్ర రావు జ్యోశ్యం చెప్పారు.















