వికారాబాద్ నవంబర్ 17 (ఈతరం ఇండియా న్యూస్ ); : బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములకు పట్టాల పంపిణీ జరిగిందని, తమ హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందిందని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా, బొంరాస్ పేట్, మండలంలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేస్తామన్న బీఆర్ఎస్ హామీ నెరవేరలేదని, కృష్ణా జలాలు తీసుకోస్తామని మోసం చేశారని మండిపడ్డారు. మాదనపూర్ నుంచి ఇక్కడ తండాలకు రోడ్లు వేయించింది తానేనన్నారు.
ప
దేళ్లలో ఈ ప్రాంతానికి సీఎం కేసీఆర్ చేసిందేమీలేదని, ఓటుకు పదివేలు ఇచ్చి బీఆర్ఎస్ గెలవాలనుకుంటోందని, డబ్బు, మద్యంతో ఎన్నికల్లో గెలవాలని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బంగారు తెలంగాణ సంగతేమో కానీ.. భార్య మెడలో బంగారం అమ్మే పరిస్థితి తెలంగాణలో దాపురించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల మొదటి తారీఖున రూ.2,500 ఖాతాలో వేస్తామని స్పష్టం చేశారు.రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని, మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేలు అందిస్తామన్నారు. రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు అందిస్తామని, ప్రతీ పేదవాడు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, చేయూత పథకం ద్వారా నెలకు రూ.4వేలు పెన్షన్ అందిస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.















