హైదరాబాద్ డిసెంబర్ 16 (ఈతరం ఇండియా న్యూ స్);: ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని లేకపోతే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్లో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పదాధికారుల సమావేశం జరిగింది. కరీంనగర్, వేములవాడ జిల్లాల అధ్యక్షులతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి సహా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఆ పైస్థాయి నాయకులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశాలను వివరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వారిపై చర్యలు తీసుకోవాలి
బండి సంజయ్ ఏమన్నారంటే….‘‘ కేసీఆర్ మినహా ఓడిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. ప్రజల సొమ్మును దోచుకుతిన్నారు. వెంటనే వాళ్ల అవినీతిని బయటపెట్టాలి. వాళ్లపై చర్యలు తీసుకోవాలి. అంతకంటే ముందే వాళ్ల పాస్ పోర్టులన్నీ రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలి. లేకుంటే విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉంది. వీరితోపాటు ఇన్ని అరాచకాలకు కారకులైన కేసీఆర్ సీఎంగా ఉండగా సీఎంఓలో పదవీ విరమణ చేసిన అధికారులు అడ్డగోలుగా సంపాదించి ప్రజల ఆస్తులను దోచుకుని తెలంగాణను సర్వనాశనం చేశారు. వాళ్ల పాస్ పోర్టును కూడా స్వాధీనం చేయాలి. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నందున ఆరోగ్యం కుదటపడే వరకు ఈ విషయంలో ఆయనను మినహాయించాలి’’అని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
















