యాదాద్రి భువనగిరి, జనవరి 14(eetaram bharatam news): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని సుప్రసిద్ధ శ్రీవైష్ణవ క్షేత్రమైన శ్రీలక్ష్మీగోదాసమేత శ్రీరంగనాయకస్వామి దేవాలయంలో భోగి పర్వదినం సందర్భంగా ఆదివారం రాత్రి గోదాకళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీగోదారంగనాథుల కళ్యాణం జరిగింది. మోటుపల్లి పవన్కుమారాచార్యులు నిర్వాహణలో కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. లోక కళ్యాణం కోసమే ప్రతియేటా గోదా కళ్యాణం జరుగుతుందని వేదపండితులు భక్తులకు వివరిస్తూ కళ్యాణోత్సవ శుభ ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అర్చకులు మంగళగిరి శేషగిరి, వరదరాజు కళ్యాణ నిర్వాహకులుగా వ్యవహరించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు, పురప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణోత్సవం సందర్భంగా గోదా రంగనాయకుల కథతో రూపొందించిన శాస్త్రీయ నృత్యాలను పలువురు విద్యార్థులు, కళాకారిణులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.















