హైదరాబాద్, జనవరి 26 (ఈ బీ న్యూస్): హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ రూ.300 నుంచి రూ.400 కోట్లకుపైగానే ఉన్నట్టు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అంచనా వేశారు. శివబాలకృష్ణ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇండ్లలో 16 చోట్ల సోదాల అనంతరం మొత్తం రూ.99,60,850 నగదు, 1,988 గ్రామాలు బంగారు, వజ్రాభరణాలు, సుమారు 6 కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దాదాపు రూ.5,96,27,495 విలువైన చర, స్థిర ఆస్తులను కనుగొన్నట్టు వెల్లడించారు. సోదాల్లో దొరికిన మొత్తం స్థిర, చర ఆస్తులు ప్రభుత్వ విలువ ప్రకారం రూ.8,26,48,999 అని, బయటి మార్కెట్లో వాటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇంకా అదనపు ఆస్తులకు సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతున్నదని వివరించారు. ఏసీబీ యాక్ట్‌లోని యూ/ఎస్ 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఏసీబీ రిమాండ్ కోసం తర్వలో పిటిషన్ వేయనున్నట్టు పేర్కొన్నారు.24 గంటలపాటు 16 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అతడిని అరెస్టు చేశారు. సుమారు 12 గంటల పాటు ఏసీబీ అధికారులు పలు కోణాల్లో విచారించినా శివబాలకృష్ణ నోరు విప్పలేదు. దీంతో నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా, ఫిబ్రవరి 8 వరకు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది.















