EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించినప్పుడు ప్రజలే కార్యోన్ముకులు కావాలి      ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు             ప్రజల ఉద్యమ ఆకాంక్షలే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు        ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

హైదరాబాద్‌ జనవరి 26 (ఈ బీ న్యూస్);: భిన్న జాతులు, మతాలు, కులాల సమాహారంగా ఉన్న దేశంలో అందరినీ ఐక్యం చేసి, భారతజాతిగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక లిఖిత రాజ్యాంగం రాసుకుని 74 ఏళ్లు దిగ్విజయంగా ఆ రాజ్యాంగ మార్గదర్శకత్వంలో దేశం ముందుకు సాగడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు. ఈ ఘనత రాజ్యాంగ నిర్మాతలకు, ఈ దేశ ప్రజలకు దక్కుతుందని తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించినప్పుడు ప్రజలే కార్యోన్ముకులై తమ పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తి రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.

ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలుపెట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది.

ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైంది. ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలులోకి వచ్చిన విషయం తెలుసు. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 11 కోట్లకుపైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మిగిలిన గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి ప్రజల మొఖాలలో ఆనందం చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోంది.

ప్రజల ఉద్యమ ఆకాంక్షలే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. అందుకే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజల నుంచి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించాం.ఈ కార్యక్రమంలో 1,25,84,383 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను ప్రస్తుతం శాఖల వారిగా క్రోడీకరించి, కంప్యూటరీకరించి వాటి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందుతోంది.

రైతుల విషయంలో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతో పాటు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగింది. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రజావాణి కార్యక్రమాన్ని కేవలం హైదరాబాదుకే పరిమితం చేయకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన తెలంగాణలో ఉంది అని చెప్పడానికి గర్విస్తున్నాను. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిజనులు, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా పాలన అడుగులు వేస్తోంది. ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని, అభివృద్ధిలో తెలంగాణ అత్యున్నత శిఖరాలకు చేరాలని.. సంక్షేమంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని కోరుకుంటున్నాను.’ అని గవర్నర్‌ తమిళిసై అన్నారు.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top