30.1.2024ఖమ్మం బ్యూరో నలు బోల మధు లత : స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను, ప్రాణ త్యాగాలను స్మరించుకుని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలని జిల్లా అధికారులతో కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పోలీస్ కమీషనర్ సునీల్ దత్, జిల్లా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకుముందు కలెక్టర్, పోలీస్ కమీషనర్ లు మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలవేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యంలో మహాత్మా గాంధీ ప్రత్యేక పాత్ర పోషించారని, గాంధీజీ స్వేచ్ఛ కోసం సత్యం, అహింస మార్గాన్ని ఎంచుకొని పలు ఉద్యమాలు చేశారన్నారు. స్వాతంత్ర్య సమర యోధుల పోరాటాలు, ప్రాణ త్యాగాలు వెలకట్టలేని వని, వారి ఆశయాలను, విలువలను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఆదర్శవంతంగా ముందుకు నడవాలని అధికారులతో అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మనం స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకొని విధుల పట్ల నిజాయితీ, నిబద్దతతో, అంకితభావం కలిగి ఉండి, సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తద్వారా మన ప్రాంతానికి, ప్రభుత్వానికి, మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు .ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.















