హైదరాబాద్, జనవరి 30(ఈ బీ న్యూ స్); : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్ఎండీఏ ఆమోదించింది. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం నాడు రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రజా యుద్ధ నౌకగా పేరుగడించిన గద్దర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన సమయంలో రాజకీయ పార్టీలు స్పందించిన తీరు అప్పట్లో చర్చకు దారి తీశాయి. అయితే టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం గద్దర్ అంతిమయాత్రలో అన్నీ తానై ముందుకు నడిపించారు. గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న రేవంత్.. భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర, అంత్యక్రియలు ఇలా అన్నింటిలో ముందుండి నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగినప్పటికీ.. అక్కడ అన్నీ చూసుకుంది మాత్రం రేవంత్ రెడ్డే. ఒక్కమాటలో చెప్పాలంటే గద్దర్‌ను కాంగ్రెస్ తన సొంతమనిషిలా చూసుకుని ఘనంగా వీడ్కోలు పలికింది.















