హైదరాబాద్ ఫిబ్రవరి 2: (ఈ బీ న్యూ స్);లంకెబిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సెక్రటేరియట్లో కంప్యూటర్లు, పేపర్లు ఉంటాయని లంకెబిందెలు ఉండవని ఎద్దేవా చేశారు. ప్రజల తరుపున పోరాడుతామని, ప్రతి హామీని వారు నెరవేర్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా గులాబీ జెండాకు ఓటు వేస్తేనే మన గొంతుక ఉంటదని కేటీఆర్ పేర్కొన్నారు.కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. అయితే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలన్నారు. కృష్ణా గోదావరి జీవ నదులని.. కృష్ణాలో తెలంగాణ వాటాను కేంద్రం తేల్చలేదన్నారు. తెలంగాణ వాటా చెప్పకుండానే ఆ బోర్డుకు రాష్ట్ర కృష్ణా జలాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మల్లారెడ్డితో పోటీ పడే పరిస్థితి ఎవరికీ లేదన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకుడు మల్లారెడ్డి అని చెప్పుకొచ్చారు. 420 హామీలు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారని మండిపడ్డారు.‘‘2 లక్షలు లోన్ తీసుకోమన్నారు, నేను మాఫీ చేస్తా అన్నారు.. ఎటుపోయింది? కోటి 57 లక్షల మంది ఆడబిడ్డలు రూ.2500 కోసం వేచి చూస్తున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల కడుపుకొట్టారు. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, 420 హామీలు తర్వాత అమలు చేస్తా అన్నారు. రేవంత్ లాంటి వాళ్ళను చాలా మందిని చూసాం. ఎంతో మంది తిస్మార్ ఖాన్లను మాయం చేసి తెలంగాణ తెచ్చారు కేసీఆర్. ఎవరికి అన్యాయం జరిగిన అందరం బస్ వేసుకొని వస్తాం. మన బాస్లు ఢిల్లీ, గుజరాత్లలో లేరు. తెలంగాణ మాట ఢిల్లీలో వినబడాలి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలి’’ అని మాజీ మంత్రి కోరారు.















