అమరావతి, ఫిబ్రవరి 05 (ఈ బీ న్యూ స్);: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీల మధ్య కొత్త, పాత స్నేహాలు చిగురిస్తున్నాయి. తాజా పరిస్థితులు గమనిస్తుంటే.. ఏపీలో 2014 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అవును, ఇప్పటి వరకు టీడీపీ, జనసేన పార్టీల మధ్యే పొత్తు కన్ఫామ్ అవగా.. ఇప్పుడు ఈ రెండు పార్టీలతో జత కట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఉవ్విళ్లూరుతోందట. ఇదే అంశం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త, పాత స్నేహితులను కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. ఇందులో భాగంగానే.. ఏపీలో టీడీపీ, జనసేన అగ్రనేతలకు బీజేపీ హైకమాండ్ టచ్‌లోకి వచ్చింది. పొత్తులపై మాట్లాడుకుందామని బీజేపీ అధిష్టానం సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలోనే.. టీడీపీ, జనసేన నేతల మధ్య రెండు దఫాలుగా నాలుగున్నర గంటల పాటు చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటులో స్థానాల సంఖ్య, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై ఇద్దరు నేతలు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు ఇప్పటికే కొలిక్కి వచ్చాయని, ఫిబ్రవరి 8వ తేదీన మరోసారి భేటీ కావాలని రెండు పార్టీల అధినేతలు నిర్ణయించారు.ఇదిలాఉంటే.. పొత్తుల అంశంపై బీజేపీ హైకమాండ్‌లో కీలక నేతలు జనసేన, టీడీపీ చీఫ్‌లకు టచ్‌లోకి వచ్చారు. రేపోమాపో చంద్రబాబు, పవన్‌తో నేరుగా మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. ఇదిలాఉంటే.. బీజేపీతో పొత్తు అంటే టీడీపీ, జనసేన పునారలోచిస్తున్నాయి. బీజేపీతో పొత్తుపై రెండు పార్టీల అధినేతలు, కేడర్‌లో వ్యతిరేకత ఉందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానంతో భేటీపై ఇరుపక్షాల నేతల మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మరి మునుపటిలా ఈ మూడు పార్టీలు కలుస్తాయా? లేక జనసేన-టీడీపీ కూటమి మాత్రమే ఎన్నికల్లో పోటీకి దిగుతుందా? అనేది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే
.















