హైదరాబాదు, ఫిబ్రవరి -20 (ఈ బీ న్యూస్ ); నేటి నుంచి సమ్మక్క సారక్క మహా జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అత్యంత పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, మహా జాతరలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకానికి తావు లేకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షులు ఎస్ సి హెచ్ రంగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి దేవాదాయ-ధర్మాదాయ శాఖను డిమాండ్ చేశారు. దాదాపు రెండు కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శనార్థం రానున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఆ స్థాయిలో మహా జాతర పరిసర ప్రాంతాల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ పోగుపడే అవకాశం ఉందని, దాని నియంత్రణకు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. భక్తుల్లో మరింత అవగాహన పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం జాతరకు విచ్చేసే భక్తులకు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించాలని డిమాండ్ చేశారు. అసలే అటవీ ప్రాంతం అయినందువల్ల మహా జాతర ముగిసిన తరువాత అక్కడ భారీస్తాయిలో పోగుపడే ప్లాస్టిక్ వ్యర్ధాలు పర్యావరణానికి, అటవీ జంతుజాలానికి పెను ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉందని‘ అందువల్ల మహా జాతర రోజుల్లో ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ పోగుపడకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అనివార్యంగా పోగుపడే ప్లాస్టిక్ ను ఎప్పటికప్పుడు సేకరించేందుకు పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆయన డిమాండ్ చేశారు. భక్తులు కచ్చితంగా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ విధానాలతోనే అమ్మవార్లను దర్శించుకునేలా అధికారులు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు . ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆలయాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సాధారణ ఆలయాల్లో ఇబ్బడి ముంబడిగా ప్లాస్టిక్ వినియోగం జరుగుతూనే ఉందని రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఉదాసీనత రాజ్యమేలుతున్న తరుణంలో రెండు కోట్ల మంది భక్తులు రానున్న జాతరలో భారీ స్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పోగుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కట్టడికి జాతరకు వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమేరకు ప్రచారం విస్తృతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.















