హైదరాబాద్ ఫిబ్రవరి 21 (ఈ బీ న్యూ స్);తెలంగాణను అప్పుల పాలు చేసింది గత బీఆర్ఎస్ సర్కారు అయితే.. ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిమితులు మించి పోయినా .. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ లో కేవలం కొత్త అప్పుల ద్వారానే నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడమే కాకుండా.. ఖజానా ఖాళీ అయ్యిందని తెలంగాణ ప్రభుత్వానికి కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదని తెలిపారు. అందుకే ఢిల్లీలో కేంద్రమంత్రులను కలుస్తూ కాంగ్రెస్ నేతలు వినతిపత్రాలు సమర్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. పాత బీఆర్ఎస్ ప్రభుత్వ అడుగుజాడల్లోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఆయన దుయ్యబట్టారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా… తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి భారమయ్యే సలహాదారుల పదవులు, రాజకీయ నియామకాలు అవసరమా..? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అడ్వర్టైస్మెంట్ల కోసం కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టడం సరికాదని,.. రాష్ట్ర ప్రభుత్వం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు మరింత భారంగా మారేలా సలహాదారుల నియామకాలు, కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తూ ఆర్థిక క్రమశిక్షణను గాలికి వదిలేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని రాజకీయ నియామకాలు ఆపివేయాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి నడుస్తున్నాయని చేస్తున్న అసత్యపు, అవాస్తపు ప్రచారాలు మానకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రజాకోర్టులో బట్టలూడదీసి కొడుతామని హెచ్చరించారు.విజయ సంకల్ప యాత్రకు తెలంగాణ ప్రజల్లో అపూర్వ స్పందన వస్తుండడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. తెలంగాణలో రెండు పార్టీల చిరునామా గల్లంతవుతుందనే భయం ప్రారంభమైందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయంతో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధాని పదవి అధిష్టించాలనే కోరిక ప్రజల కండ్లల్లో బలంగా కనిపిస్తోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాల్లో విజయం బిజెపిదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని గతంలోనే పార్టీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు తెలిపారు.కాంగ్రెస్ నేతలపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, కారు ఇచ్చిన వ్యక్తి లేదా తీసుకున్న వ్యక్తి స్పందిస్తే తప్పకుండా ఆధారాలు బయటపెడతానని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మధ్యలో ఎవరో మాట్లాడితే తాను స్పందించబోనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాణిక్యం ఠాకూర్, మాణిక్ రావు థాక్రేను ఎందుకు మార్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జనంలో తిరస్కరణకు గురైన వాళ్లు, విలువలు కోల్పోయినవాళ్లు.. పదవుల కోసం విమర్శలు చేస్తున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు.మాణిక్యం ఠాగూర్, ఠాక్రే మీద ఆరోపణలు, వాస్తవాలను బయట పెట్టింది… అధిష్టానానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ నాయకులు కాదా? ఆ తర్వాతే ఈ ఇద్దరు ఇంచార్జీలను మార్చింది వాస్తవం కాదా అనేదానిపై కాంగ్రెస్ అధిష్టానం సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు జైలుకు పోతుంటే.. ఇంచార్జిలు ఇంటికి పోతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కు కారు ఇచ్చిన వాళ్లైనా మాట్లాడాలి… లేదంటే తీసుకున్న వాళ్లైనా మాట్లాడాలి… అప్పుడే ఆధారాలు బయటపెడుతానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, ల్యాండ్ సెటిల్ మెంట్లు, కార్లు అంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసన్నారు
.















