పశ్చిమ గోదావరి జిల్లా (పాపికొండలు) మార్చ్ 30 (ఈతరం భారతం న్యూస్ );; జలధార ధరణి నుంచే కాదు.. చెట్ల నుంచి కూడా ఉప్పొంగుతోంది. చెట్ల నుంచి నీళ్లు ఉప్పొంగడం ఏంటని మీకు అనుమానం రావొచ్చు. కానీ ఇది నిజం. అభయారణ్యాల్లో ఉండే నల్లమద్ది చెట్టు నుంచి జలధార ఉప్పొంగింది. చెట్టు నుంచి ఉబికి వచ్చిన నీళ్లను చూసి అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పాపికొండల్లోని కింటుకూరు అటవీ ప్రాంతంలో ఓ నల్లమద్ది చెట్టు నుంచి జలధార ఉప్పొంగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో ఉన్నతాధికారుల సమక్షంలో నల్లమద్ది చెట్టుకు గొడ్డలితో రంధ్రం చేయగా, నీళ్లు ఉబికివచ్చాయి. ఈ దృశ్యాన్ని అధికారులు తమ కెమెరాల్లో బంధించారు. ఇక ఈ నల్లమద్ది వృక్షం నుంచి సుమారు 20 లీటర్ల వరకు నీళ్లు వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.















