విజయనగరం డిసెంబర్ 19 (ఈతరం న్యూ స్): అంగన్వాడీల ఉద్యమం వేడెక్కుతోంది. నిరసనల హోరు మిన్నంటుతోంది. రోజురోజుకూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. వినూత్నంగా నిరసనలు తెలియ జేస్తున్నారు. రోజంతా శిబిరం వద్దే ఉండి తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అందరి మద్దతు కూడగడుతున్నారు. తాజాగా జిల్లాలోని మూడు డివిజన్ కార్యాలయాలనూ ముట్టడించారు. భారీ ర్యాలీలుగా వెళ్లి బైఠాయించారు. జిల్లా కేంద్రంలో కలెక్ట రేట్ నుంచి భారీ సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సోమవారం ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీవో బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఎంతకీ రాకపోవడంతో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఆర్డీవో సూర్యకళ బయటకు వచ్చి అంగన్వాడీ వర్కర్ల సంఘం నాయకులతో మాట్లాడారు. వారిచ్చిన వినతిపత్రం తీసుకున్నారు. యూనియన్ నాయకులు బి.పైడిరాజు, ఎస్.అనసూయ, కృష్ణవేణి తదితరులు మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయు నాయకులు రెడ్డి శంకరరావు, బి.సూర్యనారాయణ, బి.రమణ, పి.రమణమ్మ, బి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలిలో..
బొబ్బిలి, బాడంగి, గజపతినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టులకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు వందల సంఖ్యలో బొబ్బిలి ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించారు. సమ్మెను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు, జిల్లా అంగన్వాడీల గౌరవాధ్యక్షురాలు వి.లక్ష్మి, జె.కామేశ్వరిల ఆధ్వర్యంలో అంగన్వాడీలంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలుకొట్టించడం, ఇతర సిబ్బందికి అప్పగించడం సరికాదని అన్నారు. అనంతరం గ్రోత్‌సెంటర్ హైవేలో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరిగా ఆర్డీవో ఎ.సాయిశ్రీకి వినతిపత్రం అందజేశారు. యూటీఎఫ్ నేత కె.విజయగౌరి సమ్మెకు మద్దతు పలికారు. కార్యక్రమంలో నాయకులు జి.అరుణ, నాగమణి, ఎస్.రాములమ్మ, పి.జ్యోతి, నిర్మల, సీహెచ్ రమణమ్మ, ఎ.రోజా రమణి తదితరులు పాల్గొన్నారు.
చీపురుపల్లిలో..
అంగన్వాడీలు చీపురుపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద కూడా సోమవారం ఆందోళనకు దిగారు. రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు సోమవారం పట్టణంలోని మెయిన్ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు టీవీ రమణ, ఎ.గౌరినాయుడు, రామూర్తినాయుడు, అంగన్వాడీ సంఘ ప్రతినిధులు వరలక్ష్మి, మాలతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
















