జగన్ సర్కారుపై టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానానికి సంబంధించిన పూర్తి సమాచారంతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. “రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సచివాలయ సిబ్బందికి అప్పగించిన ప్రభుత్వం.. పారదర్శకంగా, పకడ్బందీగా జరగాల్సిన పనిని అపహాస్యంగా మార్చింది. 01-04-2022 నుంచి రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లో జరుగుతాయన్న ప్రభుత్వం నిర్ణయం మొత్తం రిజిస్ట్రేషన్ల వ్యవస్థనే నీరుగార్చింది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన నూతన రిజిస్ట్రేషన్ విధానంపై ప్రజలకు అనేక సందేహాలున్నాయి. రిజిస్ట్రేషన్ తంతు పూర్తయ్యాక ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్రయవిక్రయదారులకు ఎందుకు ఇవ్వడంలేదో ప్రభుత్వం చెప్పాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా తూతూమంత్రంగా చేసే రిజిస్ట్రేషన్లతో తమకు ఏం ఉపయోగం అని కొనుగోలు, అమ్మకం దారులు ప్రశ్నిస్తున్నారు. ” అని అశోక్‌బాబు విమర్శించారు.”ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ విధానంపై ఇప్పటికే హైకోర్టులో మూడు రిట్ పిటిషన్లు పడ్డాయి. వాటిపై వాదనలు ప్రారంభమయ్యాక ఈ ప్రభుత్వం తన నిర్ణయానికి ఎంతవరకు కట్టుబడుతుందో చూడాలి. రికార్డు అసిస్టెంట్ స్థాయి ఉద్యోగికి రిజిస్ట్రేషన్ల బాధ్యత అప్పగించడం ఎంతమాత్రం సరైన విధానం కాదు. ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల అమలుకి అడ్డగోలుగా ఐ.ఆర్.ఎస్ స్థాయి అధికారుల్ని నియమిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త రిజిస్ట్రేషన్ విధానానికి సంబంధించిన పూర్తి సమాచారంతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి.” అని అశోక్‌బాబు అన్నారు.