ఏలూరు ఏప్రిల్ 4 (ఈతరం భారతం న్యూ స్);ఏలూరు గుడ్ లైఫ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ, వెస్సో ట్రస్ట్ ల సంయుక్త ఆద్వర్యం లో తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల ప్రభుత్వాసుపత్రి ఆవరణలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహనా కార్యక్రమంతో పాటు, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరం లో సుమారు 100 మందికి పైగా చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాన్సర్ పై మంచి అవగాహన కలిగి, సేవే ధ్యేయంగా నడుస్తున్న ఏలూరు వంగాయగూడెం లో ఉన్న గుడ్ లైఫ్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ లు సహకారం తో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ లైఫ్ ఫౌండేషన్ అధ్యక్షులు తోకల రాజేష్ బాబు మాట్లాడుతూఎన్నో రకాల క్యాన్సర్ వ్యాధులు ప్రారంభ దశలో తెలియక పోవడం, తీరా తెలిసేటప్పటికి, వ్యాధి ముదిరి, వైద్యం చేయించుకున్నా ఫలితం లేకుండా పోవడం జరుగు తున్నది.. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు, ఈ శిబిరం లో రోగులకు మందులు కూడా ఉచితంగా సరఫరా చేసినట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన గౌరవ దాతలందరకూ వెస్సో ట్రస్ట్ తరఫున అధ్యక్షులు బంగారు తాతారావు ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా అవగాహనా లేమితో క్యాన్సర్ బారిన పడి నిండు ప్రాణాలను పోగొట్టుకుంటున్న వారికి వెస్సో ట్రస్ట్ ప్రోత్సాహంతో32, 000/-ఆర్దిక సహాయం అందజేశారు.















