అనంతపురం జనవరి 23 (eetaram bharatam news);: జగన్ పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు… ఆయన నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నవారే తమ స్టార్ క్యాంపెయినర్లు అని ఉరవకొండ తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్ ఈరోజు ఆసరా సమావేశంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, మీడియాను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఓ రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి అంత బలహీనంగా… తనకు మీడియా లేదు అన్నట్లు సానుభూతి కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాయలసీమలో చుక్క నీటి కోసం ఆందోళన చేసిన ప్రతి రైతు స్టార్ క్యాంపెయినరేనని.. వైసీపీ స్టార్ క్యాంపైనర్లు దోపిడీలు చేస్తున్న ముఠా అని ఎద్దేవా చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో జగన్ 80 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి.. 8 ఎకరాలకు కూడా చుక్క నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు.ఉరవకొండ వైసీపీ ఇన్చార్జి విశ్వేశ్వరరెడ్డి మోసానికి నిలువెత్తు రూపం… ప్రజలు తనకు ఎన్ని పేర్లు పెట్టారో జనాలను అడిగితే తెలుస్తుందని దెప్పిపోడిశారు. తాను వలస పక్షి అయితే ఆయన వసూళ్ల పక్షి… 2019లో ఇంత గాలిలో అతను గెలవలేక… ప్రజలు తప్పు చేశారని అంటున్నారన్నారు. జాతీయ రహదారి, ఉరవకొండ ఆస్పత్రి, మేఘా డ్రిప్ ప్రాజెక్ట్ అన్ని తాను తెచ్చినవేనని స్పష్టం చేశారు. తాను తెచ్చిన మేఘా డ్రిప్ గుట్టలుగా పడి ఉంటే సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. 30 వేల ఎకరాల్లో పంటలు కోల్పోయి మూడు వేల కోట్లు నష్టపోతే నీళ్లివ్వలేని దద్దమ్మవిశ్వేశ్వరరెడ్డి అని మండిపడ్డారు. తాను దొంగ పట్టాలు ఇచ్చానని ఆయన చెబుతున్నాడు .. ఆ రోజు తన పక్కన వచ్చి నిల్చొని పట్టాలు ఇచ్చింది తనకు గుర్తులేదా అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు
.















