EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జిల్లావ్యాప్తంగా 8 కేంద్రాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

ఈతరం భారతం తిరుపతి, నవంబర్ 06 రిపోర్టర్ మనోజ్ కుమార్ :

తిరుపతి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి జిల్లాలోని 8 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.శుక్రవారం స్థానిక శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు,ఐపిఎస్., తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఈ నెల 7న మొత్తం 8 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో పరిసర ప్రాంతాలకు చెందిన నాలుగైదు మండలాల ఓట్ల లెక్కింపు జరిగేలా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. ఒకే బ్యాలెట్ బాక్స్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలు వేయడం వల్ల తొలుత వాటిని వేరు చేసి, అనంతరం జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను సంబంధిత సెగ్మెంట్ల వారీగా కలిపి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమాంతరంగా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ప్రతి కౌంటింగ్ హాల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, కౌంటింగ్ ఏజెంట్ల కోసం ప్రత్యేక బారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుమతి పొందిన కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామని, పోటీలో ఉన్న అభ్యర్థి లేదా వారి ఏజెంట్‌లో ఒకరికి మాత్రమే ప్రధాన రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) టేబుల్ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలతో పాటు నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు, వడమాలపేట మండలాలకు సంబంధించిన మొత్తం 8 మండలాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించి మధ్యాహ్న భోజన సమయానికి ఎంపీటీసీ ఫలితాలు, సాయంత్రం 6 నుంచి 7 గంటలలోపు జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మీడియా ప్రతినిధులకు కౌంటింగ్ కేంద్రాల వెలుపల ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాల సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక స్క్రీన్, సమాచార షీట్లను అందుబాటులో ఉంచుతామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ  ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జిల్లాలోని 8 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు.కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భద్రతాపరమైన అంశాలపై సమీక్షించినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించి, కేంద్రాల లోపల, వెలుపల పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు, వారి ఏజెంట్ల గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అనుమతి కలిగిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిర్దేశిత దూరం వరకు వాహనాలు, సాధారణ ప్రజల రాకపోకలను నియంత్రించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు, ప్రజలు గుమిగూడకుండా క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు.

కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పోలీసు నిఘా ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఎలాంటి ఘర్షణలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసు బృందాలు అప్రమత్తంగా ఉంటాయని పేర్కొన్నారు.

కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఫలితాలు, వివరాలను ఎప్పటికప్పుడు మీడియా ప్రతినిధులకు అధికారిక బులెటిన్ల రూపంలో అందిస్తామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ప్రజలు పోలీసు యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రవి మనోహరాచారి, తిరుపతి అర్బన్ తహశీల్దార్ జనార్ధన్, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top