ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 7:
తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము అందించేలా ఇందిరమ్మ బీమా పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కోసం లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది.మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ బీమా పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.పథకం ప్రారంభమైన మరుసటి రోజు నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు స్వీకరించనున్నాయి. అనంతరం సేకరించిన దరఖాస్తులను ఎమ్మార్వోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి అర్హులైన కుటుంబాలను గుర్తిస్తారు. ఎంపికైన వారిని పథకంలో లబ్ధిదారులుగా చేర్చనున్నారు.
సాధారణంగా జీవిత బీమా పొందాలంటే నిర్ణీత ప్రీమియం చెల్లించడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందిరమ్మ బీమా పథకంలో లబ్ధిదారులకు ఈ భారం ఉండదు. రేషన్ కార్డు ఉన్న అర్హులైన కుటుంబాల్లో కుటుంబ పెద్ద ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా సొమ్ము అందేలా ప్రభుత్వం పథకాన్ని రూపొందించింది. ఇందుకు అవసరమైన ప్రీమియాన్ని ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించనుంది.
ఇందిరమ్మ బీమా పథకంతో పాటు నవంబర్ 19 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు చీరలను పంపించారు. గతంలో బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయాలని భావించినప్పటికీ, చీరల తయారీలో జాప్యం కారణంగా సాధ్యం కాలేదు. ఈసారి వివిధ రంగుల్లో చీరలను తయారు చేయించి పంపిణీకి సిద్ధం చేశారు.














