ఈతరం భారతం తిరుపతి, నవంబర్ 01 రిపోర్టర్ మనోజ్ కుమార్ :
ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరూ భాగస్వామి కావాలనే సంకల్పంతో తిరుపతి జిల్లా పోలీసులు భద్రతా విధులతో పాటు మానవీయ సేవల్లోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూనే, పోలింగ్ కేంద్రాలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్న ఓటర్లకు అండగా నిలుస్తున్నారు.
కేవలం భద్రతే కాదు.. ఓటర్లకు భరోసా కూడా!: జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. గారి ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వీల్‌చైర్‌పై వచ్చిన ఓ వృద్ధురాలిని పోలీసు సిబ్బంది స్వయంగా దగ్గరుండి తీసుకెళ్లి, ఆమె ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం పోలీసుల మానవీయతకు అద్దం పడుతోంది.
విధి నిర్వహణలో బాధ్యత.. సేవలో మానవత్వం! ఎన్నికల సమయంలో పోలీసుల బాధ్యత శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాదని, ప్రజలకు భద్రతతో పాటు ఆత్మవిశ్వాసం, భరోసా కల్పించడం కూడా ముఖ్యమని జిల్లా ఎస్పీ సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సిబ్బంది అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు. ఆ హక్కును ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది, భయం లేకుండా వినియోగించుకునేలా భద్రత కల్పించడంతో పాటు అవసరమైన చోట మానవీయంగా స్పందించడం తమ బాధ్యతగా తిరుపతి జిల్లా పోలీసులు భావిస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణ, ప్రజల పట్ల బాధ్యతాయుతమైన సేవా దృక్పథంతో ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రజలకు భరోసాగా నిలుస్తోంది.















