ఇన్నాళ్లు బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయని చెప్పుకున్న కాషాయ పార్టీకి ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతున్నారు. 52 మంది అభ్యర్థులతో తొలిజాబితాను విడుదల చేసిన తర్వాత పార్టీని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. తాజాగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితోఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామానా చేస్తూ పార్టీ అధిష్ఠానానికి లేఖరాశారు.15 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. తన పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేశారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో చావుదెబ్బతిన్నారు. పార్టీ అగ్రనాయకత్వం ఆ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ.. కారు పార్టీ ప్రభంజనం ముందు నిలువలేక చతికిలబడ్డారు. మళ్లీ అదే బీజేపీ నుంచే పోటీచేస్తే తన రాజకీయ భవిష్యత్‌కు ప్రశ్నార్థకమవుతుందని అనుకున్నారో ఏమో.. ఆ పార్టీకి రాజీనామా చేశారు.