EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భారీ వర్షాల తో అతలాకుతలమవుతున్న తమిళనాడు రాష్ట్రం

చెన్నయ్ డిసెంబర్ 20 (ఈతరం న్యూ స్);గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల తో తమిళనాడు రాష్ట్రం అతలాకుతలమవుతోంది. పది రోజుల కిందట మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో గత మూడు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు, నిత్యవసర సరకులు అందిస్తున్నారు.

10 మంది మృతి

దక్షిణాది జిల్లాలు, ప్రత్యేకించి తిరునల్వేలి, టుటికోరిన్‌ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్‌ మీనా తెలిపారు. 24 గంటల్లో తిరునెల్వేలిలో సుమారు 670 మిల్లీమీటర్లు, టుటికోరిన్‌లో 932 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ఆ రెండు జిల్లాలకు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. గోడ కూలి కొందరు, విద్యుదాఘాతంతో కొందరు మరణించినట్లు ఆయన వెల్లడించారు.

పాఠశాలలు, కళాశాలలు బంద్‌..

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. తిరునల్వేలి, తెన్‌కాసి, తూత్తుకుడి జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు బుధవారం కూడా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్‌కోయిల్‌-కన్యాకుమారి‌‌, నాగర్‌కోయిల్‌-తిరునెల్వేలి స్సెషల్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

వరదల్లో చిక్కుకున్న 20,000 మంది..

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తామరబరాణి నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో 1.2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు వర్షం కారణంగా సంభవించిన వరదల్లో సుమారు 20,000 మంది ప్రజలు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, సైన్యం రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top