ఈతరం భారతం ముంబై ఆగస్ట్ 18 మంగళవారం :
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బలవంతపు, మోసపూరిత మతమార్పిడులను నిరోధించేందుకు ఉద్దేశించిన ‘మహారాష్ట్ర మత స్వాతంత్య్ర చట్టం, 2026’ను అమల్లోకి తెస్తూ ప్రభుత్వం అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నూతన చట్టం ఆగస్టు 28, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ప్రితమ్కుమార్ జావళే గెజిట్ ఉత్తర్వులను జారీ చేశారు.
చట్టంలోని నిబంధనలు, శిక్షలు ఇలా..
మహారాష్ట్ర మత స్వాతంత్య్ర చట్టం-2026 ప్రకారం.. స్వచ్ఛందంగా మతం మారాలనుకునే వ్యక్తులు కనీసం 60 రోజుల ముందుగా సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ కి ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఎవరైనా బలవంతంగా, మోసపూరితంగా, ప్రలోభాలకు గురిచేసి మతమార్పిడికి పాల్పడితే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు. మైనర్లు, మహిళలు, మానసిక వికలాంగులు, SC/ST వర్గాలకు చెందిన వారిని అక్రమంగా మతం మారిస్తే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు భారీ జరిమానా ఉంటుంది. ఒకవేళ ఒకసారి పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడితే 7 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. చివరగా పదే పదే నేరానికి పాల్పడితే నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ చట్టం కింద నమోదు అయ్యే నేరాలు నాన్-బెయిలబుల్‌గా పరిగణించనున్నారు. బాధితుల రక్తం పంచుకున్న బంధువులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారాన్ని కల్పించరు. ఈ చట్టం అమల్లోకి రావడంతో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల సరసన మహారాష్ట్ర కూడా చేరింది.















