EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మహాలక్ష్మి’ పథకంపై కాంగ్రెస్ దృష్టి

న్యూఢిల్లీ మే 19 (ఈతరం భారతం న్యూ స్);: లోక్‌సభ ఎన్నికల్లో ఆరవ, ఏడవ విడత పోలింగ్‌కు ముందు మహిళలను విస్తృతంగా ఆకర్షించడంపై కాంగ్రెస్ మరింతగా దృష్టి కేంద్రీకరించింది. తమ ప్రతిపాదిత ‘మహాలక్ష్మి’ పథకానికి విస్తృత ప్రచారం లక్షంగా పార్టీ 40 లక్షల పైచిలుకు కరపత్రాలు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు, ఆ పథకం కింద పేద కుటుంబం నుంచి ఒక మహిళకు ఏటా లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘తీవ్ర సంక్షోభం’ నేపథ్యంలో దేశంలోని మహిళలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వారి కోసం పార్టీ ప్రతిపాదిత ‘మహాలక్ష్మి పథకం’ వారి జీవితాల మెరుగుదలకు దోహదం చేస్తుందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్రితం వారం ఒక వీడియో సందేశంలో సూచించారు.‘పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి ఏడాది మేము లక్ష రూపాయలు ఇవ్వగలమని కాంగ్రెస్ ‘మహాలక్ష్మి’ పథకం గ్యారంటీ ఇస్తోంది’ అని ఆమె తన వీడియో సందేశంలో తెలిపారు. ఆరవ, ఏడవ దశలకు మందు దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలలో ‘మహాలక్ష్మి’ పథకంపై ప్రధాన దృష్టితో కాంగ్రెస్ 40 లక్షలకు పైగా కరపత్రాలు పంపిణీ చేయనున్నదని ఆ వర్గాలు తెలియజేశాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఢిల్లీలో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం గురించి ప్రస్తావించారు. జూలై 1న పేద మహిళలు తమ ఖాతాలను సరి చూసుకున్నప్పుడు ‘మ్యాజిక్’గా రూ. 8500డిపాజిట్ అయినట్లు కనుగొంటారని రాహుల్ ఇంతకుముందు ఒక బహిరంగ సభలో చెప్పారు.ప్రతి నెల మొదటి తేదీన ఇది జరుగుతుందని ఆయన తెలిపారు. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర సమయాల్లో పలువురు మహిళలు రాహుల్ గాంధీని కలుసుకుని తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారని, ఆ తరువాత మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రతిపాదించిందని పార్టీ వర్గాలు వివరించాయి. కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఐదు ప్రధాన గ్యారంటీల్లో మహాలక్ష్మి ఒకటి. ‘బేషరతు నగదు బదలీగా ప్రతి పేద భారతీయ కుటుంబానికి ఏటా లక్ష రూపాయలు ఇచ్చేందుకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ తీర్మానించింది. స్వల్ప ఆదాయ కుటుంబాలలోని పేదలను గుర్తిస్తారు’ అని కాంగ్రెస్ మేనిఫెస్టో తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆరవ విడత పోలింగ్ ఈ నెల 25న, ఏడవ, ఆఖరి విడతపోలింగ్ జూన్ 1న జరగనున్నాయి. వోట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది

.

 

Related News

Select the Topic
Scroll to Top