ఈతరం భారతం ముంబై: ఆగస్టు 25 మంగళవారం
మహారాష్ట్ర పోలీస్ శాఖలో చోటుచేసుకున్న రెండు ఆసక్తికర ఘటనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు పరస్పరం ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం ఒక ఘటన కాగా.. మరో మహిళా పోలీస్ అధికారి లింగ మార్పిడి చికిత్స అనంతరం తనను పురుషుడిగా అధికారిక రికార్డుల్లో నమోదు చేయాలని కోరడం మరో ఘటన.
మహారాష్ట్రలో మూడేళ్ల క్రితం జరిగిన పోలీస్ నియామక ప్రక్రియలో ఇద్దరు మహిళలు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. శిక్షణ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అనంతరం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహించిన వారు.. ఆ తర్వాత పుణెలోని ఓ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.
ఈ క్రమంలో వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారినట్లు సమాచారం. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్న ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 30న పుణెలోని ఆళందిలో వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి సంబంధించి శుభలేఖలు ముద్రించి తోటి పోలీసు సిబ్బందికి కూడా పంపిణీ చేశారు.
అయితే ఈ వివాహంపై వారిలో ఒకరి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళలు ఎలా వివాహం చేసుకుంటారని ప్రశ్నిస్తూ పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించారు.
దీంతో ఈ వ్యవహారం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రేమ, వివాహం వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించిన అంశం కావడంతో అధికారులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.అధికారుల సూచనతో ఆగస్టు 30న జరగాల్సిన వివాహాన్ని వారు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు సమాచారం.















