ఈతరం భారతం మహబూబ్ నగర్ ఏప్రిల్ 15 : జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇన్నాళ్లు పంటలెండిపోకుండా కాపాడుకోవడానికి అపసోపాలు పడ్డ రైతులకు చివరకు పంట చేతికొచ్చి కోసుకుందామనుకున్న సమయానికి అకాల వర్షాలు తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాలలో వడగళ్లు, ఈదురుగాలులతో వరి, మామిడి పంటలు తీవ్ర స్థాయిలో నష్టపోగా, మంగళవారం కూడా జిల్లాలోని పలు మండలాలలో వర్షంతో పాటు వడగళ్లు కురవడం రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇక్కడ 2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జడ్చర్ల పట్టణంలో సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు, ముసురు వర్షంతో బాదేపల్లి మార్కెట్‌లో రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా తాడ్పాలుతో కప్పారు. అడ్డాకుల మండలకేంద్రంలో గాలి ప్రభావంతో సర్వీస్ రోడ్డుపై చెట్లు కూలిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్వాడ మండలం టంకర గ్రామంలో ఈదురు గాలులకు చెట్లు విరిగిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. చేతికొచ్చిన పంట తడిసిపోయింది. రాజాపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కురిసిన వర్షానికి మామిడి రైతులతో పాటు కోతకు వచ్చిన వరి పంట దెబ్బతిన్నాయి. బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లిలో ఇంటి పై కప్పు కొట్టుకుపోయింది.