ఈతరం భారతం మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 6:
పాలమూరు విశ్వవిద్యాలయం గణితశాస్త్ర విభాగంలో గత పదిహేనేళ్లుగా అధ్యాపకుడిగా సేవలందిస్తన్న డా. నాగరాజు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.వనపర్తి జిల్లా మదనపూర్ మండలం గోపన్ పేట్ గ్రామానికి చెందిన డా. నాగరాజు అనంతమ్మ–రాములు దంపతుల కుమారుడు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆయన చిన్ననాటి నుంచే విద్యపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ప్రాథమిక విద్యను జెడ్పీహెచ్‌ఎస్ దుప్పల్లి పాఠశాలలో పూర్తి చేసి, ఇంటర్మీడియట్‌ను విజ్ఞాన్ జూనియర్ కాలేజ్, వనపర్తిలో పూర్తి చేశారు. అనంతరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వనపర్తిలో డిగ్రీ చదివారు. ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రంలో పీజీ పూర్తి చేశారు.
అధ్యాపకుడిగా పాలమూరు విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత బోధనతో పాటు పరిశోధన రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన డా. నాగరాజు, 2018లో సెట్ అర్హత సాధించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీకి అడ్మిషన్ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం గణితశాస్త్ర విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ కిషన్ గారి పర్యవేక్షణలో *“కంప్యూటేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో ఓవర్ ఏ స్ట్రెచింగ్ సర్ఫేస్ / కోన్ ఎంబెడెడ్ ఇన్ పోరస్ మీడియా”* అనే అంశంపై లోతైన పరిశోధన చేశారు.
ఈ పరిశోధనలో పోరస్ మాధ్యమంలో ఉన్న స్ట్రెచింగ్ ఉపరితలం లేదా కోన్‌పై ద్రవ ప్రవాహం ఎలా ప్రవర్తిస్తుందో గణిత మోడళ్ల సహాయంతో విశ్లేషించారు. ముఖ్యంగా ప్రవాహ ప్రవర్తన, షీర్ స్ట్రెస్, ఉష్ణ బదిలీ లక్షణాలపై సమగ్ర అధ్యయనం చేసి, సమర్థవంతమైన ఇంజినీరింగ్ మరియు పరిశ్రమల సిస్టమ్‌ల రూపకల్పనకు ఉపయోగపడే సూచనలు అందించారు. సంబంధిత వైవా వోస్ పరీక్షను విజయవంతంగా ఎదుర్కొని పీహెచ్‌డీ పట్టాను పొందారు.
డా. నాగరాజు చేసిన పరిశోధన ఫలితాలు ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలు ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మల్ ఇంజినీరింగ్, శక్తి సమర్థత, పరిశ్రమల డిజైన్ వంటి విభిన్న రంగాలకు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.
బోధనతో పాటు పరిపాలనా రంగంలోనూ ఆయన విశేష సేవలందించారు. విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ విభాగ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అనేక సామాజిక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ గారు డా. నాగరాజు గారిని ప్రత్యేక సమావేశంలో ఘనంగా అభినందించారు. పరిశోధనలను నిరంతరం కొనసాగిస్తూ బృందాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో పరిశోధనలు చేస్తే సమాజానికి దిశానిర్దేశం చేసే ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. పోరస్ మాధ్యమంలో ద్రవ ప్రవాహంపై చేసిన ఈ పరిశోధన భవిష్యత్‌లో సమర్థవంతమైన సిస్టమ్ రూపకల్పనకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ అభినందన కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డా. ప్రవీణ, ప్రిన్సిపల్ డా. మధుసూదన్ రెడ్డి, గణితశాస్త్ర విభాగాధిపతి సురేష్, అధ్యాపకులు డా. రవీందర్ రెడ్డి, డా. మధు, డా. రవికుమార్, డా. రామ్మోహన్, పీఆర్వో డా. గాలన్న తదితరులు పాల్గొన్నారు. వారు డా. నాగరాజు సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.














