నాలో నువ్వు…
(ముఖీలు- మినీ కవిత్వం)
డా. ఎన్. ఈశ్వర రెడ్డి రచించిన మినీ కవితలు నాలో నువ్వు సంపుటిగా వెలువడ్డాయి. సమాజాన్ని, మనిషిని కేంద్ర బిందువుగా చేసుకొని వైవిధ్యమైన నడకతో ఈ మినీ కవితలను 2023 ప్రచురణగా కవి పాఠకులకు అందించారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పని చేస్తున్న ఈశ్వరరెడ్డి సమకాలీన సమాజంలో కనిపించే అనేక అంశాలను గ్రహించి వాటిని కొన్ని వస్తువులుగా వర్గీకరించి ముఖీలు పేరుతో మినీ కవితలుగా కూర్చారు. ఓటు, ప్రజాస్వామ్యం, ప్రకృతి, తాత్త్వికత, ఆర్థికం, రాజకీయం, మతం, నీతి, విద్య, కుటుంబం, ప్రేమ, సామాజికత అన్న అంశాలుగా మినీ కవితలు ఈ సంపుటిలో వర్గీకృతమై కన్పిస్తాయి. నాలో నువ్వు/ సమస్త మానవ జాతివి/ చరాచర జీవ కోటివి/ తత్వానివి – సత్వానివి/ ప్రణయానివి – ప్రళయానివి/ నన్ను నడిపే చుక్కానివి! అన్న మినీ కవిత సమస్త మానవ తత్వాన్ని ఆవిష్కరించింది. పల్లె కరిగి/ పట్నం వైపు/ ప్రవహిస్తోంది/ పంటలు ఇంకి / ప్లాట్లు మొలుస్తున్నాయి./ డబ్బు కాళ్ళ కింద / మనుషులు బానిసలైపోతున్నారు అని వర్తమాన స్థితిని దృశ్యమానం చేశారు. ధర్మాగ్రహంతో పాటు మంచితనం వికసించాలని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనే ఆకాంక్షను ఈ కవితలు వ్యక్తం చేశాయి. ఎంతో ఆలోచనాత్మకంగా సాగిన ఈ మినీ కవితలు అందరూ చదవదగినవి.
( నాలో నువ్వు, రచన : డాక్టర్ ఎన్ ఈశ్వరరెడ్డి, పేజీలు 178, వెల : రూ. 150/-, ప్రతులకు ఇంటి నెంబర్ #39/449 – 47 ఫ్లాట్ నెం. 102, బ్లాక్ – బీ, ఆర్ఆర్ స్వగ్రుహాస్, రోడ్ నెం. 14, ఓం శాంతినగర్, కడప – 516001)
సమీక్ష – డా. తిరునగరి శ్రీనివాస్ 8466053933















