ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి మే 01,2024 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, అసంఘటిత కార్మికుల అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అసంఘటిత కార్మికులకు ఒక నిర్దిష్ట వయసు తర్వాత నెలా నెలా జీవిత కాలం ఫించన్ సదుపాయం కల్పించాలని కాసాని తెలిపారు. హైదరాబాద్లోని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో జై స్వరాజ్ పార్టీ కార్మిక విభాగానికి చెందిన పెయింటర్స్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్మిక, అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేయడమే కాకుండా వివిధ రకాల కార్మిక సంఘాలు చేసే పోరాటాలకు మద్దతు ఇస్తామని ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కార్మికులకు ఏ సమస్య ఉన్నా తనను సంప్రదిస్తే సహకరిస్తానని చెప్పారు. కార్మిక సమస్యలు పరిష్కరిస్తేనే సమ సమాజ నిర్మాణం వైపు అడుగులు పడతాయని జై స్వరాజ్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు గోలుకొండ రత్నం అన్నారు. తమకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికుల వల్ల ఉపాధి దొరకడం లేదని, స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పెయింటర్స్ సంఘం కమిటీ అధ్యక్షుడు గూడెం బిక్షపతి అన్నారు. ఈ కార్యక్రమంలో జై స్వరాజ్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఆర్ ఎస్ జే థామస్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సుగూరు శ్రీనివాస్, పెయింటర్స్ కమిటీ ముఖ్య సలహాదారు మాటూరి కృష్ణ మోహన్, కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గంధమల్ల మోహన్ బాబు, ప్రధాన కార్యదర్శి ముక్క రాజు, ఉపాధ్యక్షులు జంగ శ్రావణ్ కుమార్, అమ్మన బోయిన నర్సింహా , సంయుక్త కార్యదర్శులు సిహెచ్ సుమన్, కొన్నె యల్లయ్య, జెర్రిపోతుల అశోక్, టి. మోహన్, కోశాధికారి ఇందిరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.















