గుంటూరు,జనవరి 21(eetaram bharatam news) ఆరని అగ్నిజ్వాల వంటిది అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం అని ప్రముఖ సాహితీవేత్త డా. రావి రంగారావు తెలియజేశారు. ఆదివారం ఉదయం గుంటూరు బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో జరిగిన సాహిత్య సభలో ఆయన “అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం” గురించి ప్రసంగించారు. విప్లవ భావాలు ఆయన కవితలలో వెలుగొందుతుంటాయని, దోపిడీ, పీడన, హింసలను నిరసిస్తూ సమ సమాజం, శాంతి, అభ్యుదయం నెలకొనటానికి కలాన్ని ఆయుధంగా ధరించి సాహసంతో సాహితీ ప్రయాణం కొనసాగించారని వివరించారు. స్పష్టత, సూటిదనం వ్యక్తీకరణ నూతనత్వం, విషయ గాఢత, నిరాడంబర శిల్ప సౌందర్యం ఆయన కవిత్వంలో కనిపిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అభ్యుదయకవి “సోమేపల్లి వెంకటసుబ్బయ్య కవిత్వం” గురించి డా. చిల్లర భవానీ దేవి మాట్లాడుతూ పల్లెటూరి జీవన విధానం రైతుల సమస్యలు, పర్యావరణ ప్రేమ సోమేపల్లిని విశిష్ట కవిగా నిలబెడతాయని ఆమె వివరించారు. ‘గంగాశ్రీ” (తెనాలి) “ఈ మాసం కవి”గా పాల్గొని అనేక సామాజిక గేయాలను, భక్తి గీతాలను పాడి వినిపించారు. పింగళి భాగ్యలక్ష్మి నిర్వహించిన కవితా పఠన కార్యక్రమంలో మేళ్లచెరువు మాధవి మెట్టు శ్రీనివాసరెడ్డి, నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి, రఘునాథ చారి, షేక్ కాసింబి, మండే సుబ్రహ్మణ్యం, డా . మైలవరపు లలిత కుమారి, ఈవూరు వెంకటరెడ్డి, ఆళ్ల నాగేశ్వరరావు, అస్మదున్నీసా బేగం, గడల శివప్రసాద్, చిటిప్రోలు వెంకటరత్నం, చల్లా సత్యవతి గోలి హనుమత్ శాస్త్రి, సుధా మైథిలి మన్నం వెంకట గురువు, వి. వి. రావు, చందు సూర్య మొదలైన వారు పాల్గొన్నారు. డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల సుధా మైథిలి రాసిన “సంక్రాంతి” కవిత ఈ మాసం “నిక్కచ్చి కవిత”గా ఎంపికయింది. సంస్థ పక్షాన ముఖ్య అతిథి డా. చిల్లర భవానీదేవి, సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రావి రంగారావు, కన్వీనర్ పింగళి భాగ్యలక్ష్మి మొదలైన వారు “ఈ మాసం కవి” గా పాల్గొన్న “గంగాశ్రీ”ని, ఉత్తమ కవిత విజేత సుధా మైధిలిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.















