హైదరాబాద్ ఏప్రిల్ 12 (ఈతరం భారతం న్యూ స్); చట్టాలు, నిబంధనలు ఎన్ని ఉన్నా అధికారుల ఉదాసీనత కారణంగా ఇంకుడుగుంటల నిర్మాణం అటకెక్కుతూనే ఉందని, దాని ఫలితమే వేసవిలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పక్క రాష్ట్రం బెంగుళూరులో నీటికట కట తో పాటు రాష్ట్రంలో నీటికరువు కోరలు చాస్తున్న నేపథ్యం లో మున్సిపల్ శాఖ ఇప్పుడు భవనాల్లో ఇంకుడు గుంటల సమాచారం సేకరించే పనికి శ్రీకారం చుట్టడం అధికారుల ఉదాసీనతను చూపుతుందన్నారు. చట్టాలున్నా అధికారులు పట్టించుకోపోవడం వల్లే ఇవాళ ఈ నీటి ఎద్దడి పరిస్థితి తలెత్తిందని కౌన్సిల్ అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య, జాతీయ సలహాదారు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి శుక్రవారం విలేకరులతో ఆవేదన వ్యక్తం చేసారు. మరోపక్క భవన నిర్మాణదారులు కూడా ఇంకుడుగుంటలు నిర్మాణం చెయ్యాలన్న విచక్షణ మారుస్తున్నారన్నారు. తక్షణమే ఇంకుడు గుంటలు నిర్మాణం చేయని వారిపై నోటీసులతో సరిపెట్టకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ చర్యలు మరొకరు తప్పుచేయకుండా చేస్తుందన్నారు. అన్నిటికంటే భవనాలకు అనుమతి ఇచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.















