6.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
ఖమ్మం రూరల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో విడుదల కోసం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన జన జాతర బహిరంగ సభకు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ , తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు, జనం భారీగా తరలి వెళ్లారు. నాలుగు మండలాల్లోని దాదాపు అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు, ప్రజలు వందలాదిగా బస్సుల్లో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా జాతీయ మేనిఫెస్టో విడుదల కానుందని, ఇందిరమ్మ రాజ్యంలో దేశ వ్యాప్తంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందబోతున్నాయని అన్నారు. గతంలో తుక్కుగూడ సభానంతరం నిరంకుశ బీఆర్ ఎస్ కు బీటలు వారాయని, ఇప్పుడు ఈ సభానంతరం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతా జాగ్రత్తగా వెళ్లి..క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.















