7.2.2024
ఖమ్మం బ్యూరో
నలుబోల మధులత.(ఈ బీ న్యూస్)
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి తీర్థాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో తీర్థాల జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్చి 7 నుండి 11 వరకు 5 రోజులపాటు తీర్థాల జాతర జరుగనున్నట్లు తెలిపారు. సుమారు 5 నుండి 6 లక్షల మంది భక్తులు జాతరకు రానున్నట్లు అంచనా ఉందన్నారు. గతం కంటే గొప్పగా జాతర జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుద్ధ్య పరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ శివారులో పార్కింగ్ కు శుభ్రం చేయాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరిపోను ఉన్నట్లు, అదనంగా అవసరానికి త్రాగునీరు నిల్వచేస్తామన్నారు. త్రాగునీరు క్లోరినేషన్ చేయనున్నట్లు, పరీక్షలు చేపట్టి, సురక్షిత త్రాగునీరు అందించనున్నట్లు తెలిపారు. లీకేజీలు నియంత్రించాలన్నారు. స్నానాలకు నదిలో నీటికి చెక్ డ్యామ్ నుండి పంపే ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు వచ్చే రహదారుల ప్యాచ్ వర్క్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జాతరకు ఆర్టీసీ నుండి 28 బస్సులు నడుపనున్నట్లు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బస్సులు, ట్రిప్పులు పెంపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. దేవస్థానం భూమికి ఫెన్సింగ్ ఏర్పాటుచేసి, పెద్ద పెద్ద మొక్కలు నాటాలని, భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ స్థలం ఒక్క అంగుళం వడలకూడదని మంత్రి అన్నారు. కామంచికల్ వద్ద 125 మీటర్ల మేర రోడ్డు పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. పల్లెగూడెం, గొల్లపాడు రోడ్డు నిర్మాణానికి సర్వే చేసి, ఖర్చు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కళ్యాణమండపం బ్రహ్మాండంగా కట్టుకుందామని ఆయన అన్నారు. 90కెఎల్ ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. నదికి కరకట్ట వదిలి, డబుల్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఈ సమీక్ష లో జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, రూరల్ ఎసిపి బస్వారెడ్డి, పీఆర్ ఇఇ పాండురంగ విఠల్, మిషన్ భగీరథ ఇఇలు పుష్పలత, వాణిశ్రీ, మత్స్య శాఖ ఏడి ఆంజనేయ స్వామి, దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ గౌరీశంకర్, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రామకృష్ణ, ఎంపిడివో రవీందర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.















