హైదరాబాద్ ఏప్రిల్ 13 (ఈతరం భారతం న్యూ స్);జై స్వరాజ్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కుమారి యామిని లక్ష్మీని ఆ పార్టీ జాతీయ అధినేత కాసాని శ్రీనివాసరావుగౌడ్ నియమించారు. హైదరాబాద్లోని మెట్టు గూడలో ఉన్న పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ సమావేశంలో యామినిని జాతీయ అధికార ప్రతినిధిగా పార్టీ ఖరారు చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావుగౌడ్ మాట్లాడుతూ ఉన్నత సమాజ నిర్మాణమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నామని కాసాని తెలిపారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా జై స్వరాజ్ పార్టీని స్థాపించిన జాతీయ అధ్యక్షుడు శ్రీ కాసాని శ్రీనివాసరావు గౌడ్ ఆలోచన విధానం, పార్టీ సిద్ధాంతాలు నచ్చి తాను పార్టీలో చేరినట్లు యామిని ఈ సందర్భంగా తెలిపారు. తనను పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఆమె పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావుగౌడ్ కు, పార్టీ నాయకులకు పేరు పేరునా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుంబాల పరశ రాములు గౌడ్, పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ ఎస్ జే థామస్, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రామ్మూర్తి , పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు గోలుకొండ రత్నం, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి సుగూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
.















