6.4.2024 ఈ.తరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయానికి అవిశ్రాంత పోరాటం చేస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం అర్ పీ ఎస్), మహాజన సోషలిస్టు పార్టీ (ఎం ఎస్ పీ) నాయకులు ప్రతినబూనారు. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కూరపాటి సునీల్ గారి అధ్యక్షతన బీజేపీ పార్లమెంట్ కార్యాలయం దగ్గర జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ వారు మోడీ ని మరోసారి గెలిపించి మాదిగల సుదీర్ఘ కలను సాకారం చేస్తామని చెప్పారు. తమ డిమాండ్ ను పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టిన బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ లను ఓడించి గుణపాఠం నేర్పాలని వక్తలు పిలుపునిచ్చారు. తమ డిమాండ్ నెరవేర్చడానికి కీలకమైన నిర్ణయం తీసుకున్న మోడీ ని సభ అభినందించింది. మంద కృష్ణ గారే ఎంపీ అభ్యర్థి అనుకుని ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు చెప్పారు.
మోడీ గారి పనితీరు నచ్చి, ఎం అర్ పీ ఎస్ చిరకాల డిమాండ్ నెరవేర్చడం కోసం బీ జే పీ కి మద్దతు ప్రకటించిన మంద కృష్ణ గారికి, వారి టీమ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
“ఇంత పెద్ద పోరాటాన్ని దశాబ్దాల పాటు నిర్వహించడం మామూలు విషయం కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం, న్యాయమైన డిమాండ్ కోసం ఇన్నేళ్ల పాటు కృష్ణ గారికి అండ దండలు అందిస్తున్న మీకు అందరికీ శుభాభినందనలు,” అని ఆయన చెప్పారు.
సబ్ కా సాత్..సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్..అన్న ధృఢ సంకల్పంతో మోడీ గారు పాలిస్తున్నారనీ, బడుగు, బలహీన, వెనుకబడిన, గిరిజన వర్గాలను గుండెలకి హత్తుకుని ఆయన అభివృద్ధి సాధిస్తున్నారని చెప్పారు. ఖమ్మాన్ని 400 సీట్ల జాబితాలో చేర్చడానికి కలిసి కృషి చేద్దామని నేతలు పిలుపునిచ్చారు.
బీ జే పీ, టీ డీ పీ, జన సేన, ఎం ఆర్ పీ ఎస్, ఎం ఎస్ పీ కార్యకర్తలు, నేతలు కలిస్తే సాధ్యం కానిది ఏమీ లేదు. మీరు అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెళ్ల లా కలిసి పనిచేయండి. మోడీ గారిని బలోపేతం చేయండి అని అన్నారు. ఈ సమావేశంలో బి జె పి అధ్యక్షులు గల్లా సత్యనారాయణ,తురగంటి అంజయ్య-ఎంఎస్పీ జిల్లా అద్యక్షులు, ఎం ఎస్ పీ నేతలు ఏపూరి వెంకటేశ్వర్లు, వంగూరి ఆనందరావు, వంచర్ల క్రాంతి, బచ్చల కూర వెంకటేశ్వర్లు, కొలిక పోగు వెంకటేశ్వర్లు, పగిడికాయల ఈదయ్య, ధేపంగి రమణ, ఉటుకూరు రత్నాకర్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, ఎం అర్ పీ ఎస్ నేత ఇనుపల్లి అశోక్, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా నేతలు కోటమర్తి సుదర్శన్, రీగన్ ప్రతాప్ ఇతర నాయకులు పాల్గొన్నారు.















