అమరావతి సెప్టెంబర్ 20 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );తిరుమలలో లడ్డూ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో తయారయ్యే ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు.అత్యంత పవిత్రమైన తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదని అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిందని అన్నారు. ఇంత పెద్ద విషయాన్ని సీఎం చంద్రబాబు ఎలా ఈజీగా తీసుకున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుందన్నారు. ఇది చిన్న సమస్య కాదని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు షర్మిల లేఖ రాశారు.















