EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ.. నిజాం నుంచి విముక్తి కల్పించింది కాంగ్రెస్ పార్టీ.. బిజెపికి సంబంధం లేదు  ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ : ఉత్తమ్

హైదరాబాద్ సెప్టెంబర్ 15 (ఈతరం భారతం);: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో గత కొంతకాలంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరంటూ సాగిన ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రెటరీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. పదవీ బాధ్యతల అనంతరం మహేశ్ కుమార్ గౌడ్‍కు సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందలు తెలిపారు.ఈ ఏడాది జులై 7న అప్పటివరకూ టీపీసీసీ చీఫ్‌గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. దీంతో ఆ స్థానం కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. వీరిలో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లు బలంగా వినిపించాయి. వీరంతా పదవి కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే అనూహ్యంగా పార్టీ అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ పేరు ప్రకటించింది. ఆయన నియామకాన్ని తెలియజేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ప్రకటన సైతం విడుదల చేశారు. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. వెనుకబడిన తరగతులకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అవకాశం ఇస్తుందని ఉత్తమ్ తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ తో గెలిచి ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్ర్య వచ్చిందన్నారు. నిజాం నుంచి విముక్తి కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని, బిజెపికి సంబంధం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని ఉత్తమ్ కొనియాడారు.

Related News

Select the Topic
Scroll to Top