హైదరాబాద్ మే 18 (ఈతరం భారతం న్యూ స్);; ఏకో టూరిజం పేరుతో నల్లమల అడవిని గాయం చేయడం మానుకోవాలని, తక్షణమే ఆ నిర్ణయాన్ని మానుకోవాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే అడవులు కుచించుకు పోయి పచ్చదనం కనుమరుగై అనేక సమస్యలు ఎదురవుతున్నా ప్రభుత్వం ఏకో టూరిజం పేరుతో ముందుకు పోవడం పర్యావరణం పట్ల తన నిర్లక్ష్య వైఖరి తెలియజేస్తుందన్నారు. తాజా ప్రభుత్వ నిర్ణయం నల్లమలలో జీవవైవిధ్యాన్ని కూడా ధ్వంసం చేస్తుందని కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య, జాతీయ సలహాదారులు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నగాక మొన్న కరోనా విపత్తు చూసి కూడా అడవుల మనుగడ నష్టానికి పూనుకోవడం బాధాకరమన్నారు. ఒకపక్క ఐక్య రాజ్యాసమితి పర్యావరణ పరిరక్షణ కోసం మొత్తుకుంటున్నా దానికి భిన్నంగా ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయడం సామాజిక భద్రత కంటే వ్యాపార దృక్పధం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అంతేగాక ఎన్టి సిఏ (నేషనల్ టైగర్స్ కన్సర్వేషన్ ఆధారిటీ), నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు, జాతీయ పర్యావరణ -అటవీ అనుమతులు లేకుండా, చట్టంలో లొసుగులతో స్థానిక తెగలతో తీర్మాణం చేసుకొని ముందుకు పోవడం పర్యావరణ సమస్యను మరింత జఠిలం చేయడమే అవుతుందని వారు విమర్శించారు. దశాబ్దాలుగా ప్రకృతి పగబడుతున్నా పట్టించుకోకుండా . ..నల్లమల అడవిలోని సలేశ్వరం ఆలయ భక్తుల పేరుతో సమాజానికి మరణశాసనాన్ని లిఖించవద్దని, ప్రభుత్వానికి, అటవీ శాఖకు వారు విజ్ఞప్తి చేశారు.















